ఖమ్మంవ్యవసాయం: పంటల విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యాపారులు జీరో వ్యాపారం, ఆర్డీ(రేట్ డిఫరెన్స్)కు పాల్పడుతూ ప్రభుత్వానికి తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. ప్రధానంగా మిర్చి క్రయవిక్రయాల్లో ఈ వ్యవహారం జరుగుతుండగా, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇటీవల వెలుగుచూసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మిర్చి క్రయవిక్రయాలపై పర్యవేక్షణ బృందాలను నియమించి నివేదికలను తెప్పించుకుంది. అయినా అక్రమాలు ఆగలేదన్న సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ బృందాలను నియమించారు. మిర్చి క్రయవిక్రయాలు జరిగే ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఈ బృందాలను ఏర్పాటుచేశారు. కోల్డ్ స్టోరేజీలు, చెక్ పోస్టుల్లో తనిఖీ చేస్తూ వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలు, బిల్లుల్లో పేర్కొన్న ధరల్లో వ్యత్యాసం ఉంటే రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు నివేదించాల్సి ఉంటుంది. ఈమేరకు ఖమ్మం జిల్లాలో ఏడుగురు అధికారులతో బృందాన్ని నియమించగా తనిఖీలు మొదలుపెట్టారు.
విజిలెన్స్ కమిటీలను నియమించిన ప్రభుత్వం


