కల్లూరు రూరల్: ఖేలో ఇండియా పాల్గొనే ఉమ్మడి జిల్లా ఖో–ఖో బాలుర జట్టును బుధవారం ఎంపిక చేశారు. కల్లూరులోని మినీ స్టేడియంలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో కొమరం చంద్రశేఖర్, తోలేం సాగర్, గుమ్మడి నిఖిల్‌వర్మ, బత్తుల గణేష్, గంగాధరిని వివేక్, భూక్యా నర్సింహారావు, ఈసం అజయ్‌కుమార్, షేక్ జావిద్, మధుచరణ్, తాటి సర్వేశ్వరరావు, ముక్కంటి జస్వంత్, మెరుగు ఉపేంద్ర ఎంపికయ్యారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్యతో పాటు కాటేపల్లి కిరణ్ కుమార్, మట్టూరి జనార్దన్, పి.నరసయ్య, ఎస్.రామారావు పాల్గొన్నారు.
‘బీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక నైజం’
ఖమ్మంమయూరిసెంటర్: బీఆర్‌ఎస్ పార్టీ దళిత వ్యతిరేక నైజం మరోసారి బహిర్గతమైందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా దళిత నాయకులు ఎరవ్రల్లి వద్ద ఆందోళనకు దిగితే, బీఆర్‌ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దుర్మార్గమని తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకుల తీరు మారకపోతే ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
చోరీ కేసుల్లో ఇద్దరు నిందితుల అరెస్ట్
జూలూరుపాడు: ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని బుధవారం అరెస్ట్ చేసినట్లు జూలూరుపాడు ఎస్‌ఐ ఎన్.జీనత్ కుమార్ తెలిపారు. జూలూ రుపాడు సాయిబాబా ఆలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఖమ్మానికి చెందిన ఎస్కే ఖాజా, జి.లాలయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు కొమ్ముగూడెం తదితర ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు తేలింది. రూ.5,798లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ–2 మనీషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పాముకాటుతో రైతు మృతి
చింతకాని: మండలంలోని ప్రొద్దుటూరుకు చెందిన కౌలు రైతు తుడుం నాగయ్య(44) పాము కాటుతో మృతి చెందాడు. ఆయన భూమి కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలను సాగుచేశాడు. పత్తి పంటకు బుధవారం ఉదయం పురుగుల మందు పిచికారీ చేస్తుండగా కాలి భాగంలో పాము కాటేసింది. దీంతో ఆయనను కుటుంబసభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష
ఖమ్మం లీగల్: ఖమ్మం ధంసలాపురానికి చెందిన గంగినేని శ్రీనివాసరావు వద్ద రఘునాథపాలెం మండలం బూడిదంపాడుకు చెందిన దిరిశాల నరసింహస్వామి 2017లో విడతల వారీగా రూ.5.40లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి 2019 ఫిబ్రవరిలో చెక్కు జారీ చేసినా ఆయన ఖాతాలో సరిపడా లేక తిరస్కరణకు గురైంది. దీంతో శ్రీనివాసరావు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం నరసింహస్వామికి ఏడాది జైలు శిక్షతో పాటు ఫిర్యాదికి రూ.3లక్షలు చెల్లించాలని తీర్పు ఇవ్వడమే కాక రూ.10వేల జరిమానా విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కాకుమాని జ్యోతిర్మయి బుధవారం తీర్పు చెప్పారు.
ఇంకొకరికి ఆరు నెలలు
ఖమ్మం పాకబండ బజార్‌కు వెంకటనాగేశ్వరరావు వద్ద ద్వారకనగర్‌కు చెందిన సాముల లక్ష్మీనారాయణ 2021 అక్టోబర్‌లో రూ.1.50లక్షల అప్పు తీసుకుని తిరిగి 2022 నవంబర్‌లో చెక్కు జారీ చేశాడు. కానీ ఆయన ఖాతాలో నగదు లేక తిరస్కరణకు గురైంది. ఈమేరకు వెంకటనాగేశ్వరరావు దాఖలు చేసిన కేసును విచారించాక లక్ష్మీనారాయణకు ఆరు నెలల జైలుశిక్ష విధించడంతో పాఉ ఫిర్యాదికి రూ.1.50లక్షలు చెల్లించాలంటూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బెక్కం రజిని తీర్పు చెప్పారు.


