గురుకులంలో ఎనిమిదో తరగతి విద్యార్థి మృతి
ఆకస్మిక గుండెపోటు కావొచ్చని అనుమానాలు
మరో విద్యార్థి ఆత్మహత్య.. నీట మునిగి యువకుడి కన్నుమూత
రఘునాథపాలెం: ‘బాగా చదువుకుంటే గొప్ప స్థాయికి చేరతాడు.. ఆతర్వాత మనల్ని ఆదుకుంటాడు’ అని ఆశించిన ఆ తల్లిదండ్రుల కలలు మధ్యలో చెదిరిపోయాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబంలో పుట్టిన బిడ్డ అర్ధంతరంగా తనువు చాలించాడు. తిరుమలాయపాలెం మండలం కాకరవాయికి చెందిన ఎస్.హరీష్ – ప్రియాంక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు హిమవర్షిత్ బధిరుడు కాగా, పెద్దకుమారుడైన సాత్విక్(14)ను రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకులంలో ఎనిమిదో తరగతి చదివిస్తున్నారు. కూలి పనుల కోసం హరీష్ దంపతులు హైదరాబాద్‌లో ఉంటుండగా.. కుమారుడిని గురుకులంలో చేర్పించారు. రోజులాగే బుధవారం ఉదయం నిద్ర లేచిన సాత్విక్ స్నేహితులతో కలిసి రన్నింగ్ చేశాడు. ఆతర్వాత వాలీబాల్ ఆడేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పీఈటీ డి.కృష్ణ వాచ్‌మెన్ సాయంతో ఆస్పత్రికి తరలించింగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఆకస్మిక గుండెపోటే కారణంగా అనుమానిస్తున్నా, పోస్టుమార్టం నివేదిక వస్తే స్పష్టత రానుంది.
సాత్విక్ మృతి చెందాడనే సమాచారం తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. అలాగే, ఆర్‌డీఓ శ్రీనివాసరావు, గురుకులా ఆర్‌సీఓ రాంబాబు పాఠశాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా, విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి ప్రిన్సిపాల్ రాము, ఆర్‌సీఓపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో బందువులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. రెండు గంటలకు పైగా ఆందోళన కొనసాగగా ఆర్‌డీఓ, ఏసీపీ రమణమూర్తి, సీఐ ఉస్మాన్ షరీఫ్ వారితో చర్చించారు. అనారోగ్యంతో మృతికి ఎవరేం చేయలేరని నచ్చచెప్పి, కుటుంబాన్ని ఆదుకుంటామని తెలి పారు. రూ.2లక్షలు ఆర్థికసాయం, కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో పాటు అంత్యక్రియల కోసం రూ.20వేలు అందించినట్లు తెలిసింది. అలాగే, ఉపాధ్యాయులు, ఉద్యోగులు రూ.లక్ష అందించేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.


