ఖమ్మంరూరల్: పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రైతు, కార్మిక సమస్యలు, సామాన్యులపై పడుతున్న భారాల నేపథ్యాన ప్రజల తరఫున పోరాడేలా కమ్యూనిస్టుల అవసరం మరింత పెరుగుతోందని సీపీఎం మాజీ శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి ముత్తగూడెంలో బుధవారం నిర్వహించిన పాలేరు డివిజన్ స్థాయి వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. కమ్యూనిజం రాజకీయ సిద్ధాంతం మాత్రమే కాద ని, శ్రమజీవుల హక్కులు, సమానత్వం, దోపిడీ లేని సమాజ నిర్మాణం కోసం జరిగే పోరాట రూపమని తెలిపారు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్న ప్రస్తుత తరుణాన సోషలిజం ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. లౌకికతత్వం, సామాజిక న్యాయం పరిరక్షణకు కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈమేరకు యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. కాగా, నవంబర్ 15వ తేదీన నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు మహాసభలకు జిల్లా నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఇంకా ఈసమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, బండి రమేష్, మాదినేని రమేష్, యర్రా శ్రీనివాసరావు, బుగ్గవీటి సరళ, సుమతి, నండ్ర ప్రసాద్, షేక్ బషీరుద్దీన్, కొమ్ము శ్రీను, వడ్లమూడి నాగేశ్వరరావు, తోటకూరి రాజు, ప్రతాపనేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి


