పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను విపరీతంగా పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపుతోందని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. శిరోమణి విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో బుధవారం కలెక్టరేట్ ఎదుట గ్యాస్, వంట సరుకులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలు, మందుల ఖర్చులు పెరగగా.. ఇప్పుడు మంచి నూనె, పంచదార, పప్పులు, ఉల్లిగడ్డల ధరల పెంపుతో ప్రజలపై భారం పడుతోందని చెప్పారు. ఇకనైనా రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందజేయాలని డిమాండ్ చేశారు. నాయకులు టి.ఝాన్సీ, ప్రతాపనేని శోభ, గోకినేపల్లి సరోజిని, పరిమిల, అనసూయ, సుగుణ, సునీత, సీత, నిర్మల, పుల్లమ్మ, మరియమ్మ, రమణ తదితరులు పాల్గొన్నారు.


