జిల్లాలో మొదలైన సర్వే
● ముమ్మరంగా వ్యవసాయ, నీటి కనెక్షన్ల సర్వే ● సర్వే ఆధారంగా బడ్జెట్, నిర్వహణ విధులు
ఖమ్మంవ్యవసాయం: రైతు డిస్కం ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ డిస్కం పరిధిలోకి చేర్చాల్సిన కనెక్షన్ల సంఖ్య తేల్చేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. దీంతో వ్యవసాయ, తాగునీరు, ఎత్తిపోతల పథకాల కనెక్షన్ల సర్వే మొదలుపెట్టారు. వ్యవసాయ రంగానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించే లక్ష్యంతో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఆర్పీడీసీఎల్)ను రైతు డిస్కం పేరిట ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ డిస్కంల పరిధి నుంచి వ్యవసాయ, తాగునీరు, ఎత్తిపోతల పథకాలను కనెక్షన్లను ఈ డిస్కంలోకి బదలాయిస్తారు.
ఇప్పటికే లైసెన్స్ కూడా...
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డిస్కం ఏర్పాటుకు నిర్ణయించగా కేబినెట్ ఆమోదం పొందింది. ఆపై రైతు డిస్కం పేరు ఖరారు చేసి సీఎండీగా ముషారఫ్ అలీ ఫరూఖీని నియమించారు. ఆతర్వాత లైసెన్సు కూడా జారీ అయింది. ఇక కంపెనీకి కేటాయించాల్సి ఆస్తులు, కనెక్షన్లు, పీపీఏలు, ఉద్యోగుల బదిలీలను ఖరారు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఆపై మరో అడుగు ముందకేసి రైతు డిస్కంలోకి చేర్చాల్సిన విద్యుత్ కనెక్షన్ల సర్వే మొదలుపెట్టారు. రాష్ట్రంలోని ఉత్తర, దక్షణ డిస్కంల పరిధి నుంచి సుమారు 29 లక్షల వ్యవసాయ, ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథ, జలమండలి, మున్సిపల్ తాగునీటి సరఫరా కనెక్షన్లను ఈ డిస్కంలో చేర్చే అవకాశముంది.
జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ఎన్యుమరేషన్‌ను అధికారులు మొదలుపెట్టారు. డివిజన్ల వారీగా ప్రతీ స్ట్రక్చర్, ట్రాన్స్‌ఫార్మర్‌ను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలు నమోదు చేస్తున్నారు. ఖమ్మం సర్కిలో పరిధిలో మొత్తం 33,729 స్ట్రక్చర్లు ఉండగా, వీటి పరిధిలో 16,038 వ్యవసాయ డీటీఆర్‌లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 16,153 స్ట్రక్చర్ల సర్వే పూర్తికాగా, మిగతా 17,576 స్ట్రక్చర్లపై దృష్టి సారించారు. ఖమ్మం విద్యుత్ సర్కిల్ పరిధిలో ఖమ్మం రూరల్, సత్తుపల్లి, మధిర, ఖమ్మం, వైరా డివిజన్లు ఉండగా.. ఎన్యుమరేషన్ పూర్తయితే ప్రతీ గ్రామంలో వ్యవసాయ కనెక్షన్ల లెక్క తేలనుంది. అంతేకాక ట్రాన్స్‌ఫార్మర్ల సామర్ద్యం ఎంత అనేది కూడా స్పష్టత వస్తుంది. తద్వారా రైతు డిస్కంకు ప్రత్యేక బడ్జెట్, సిబ్బంది, లైన్ల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


