అన్ని వసతులు..
ముగ్గురు మంత్రులు
● ‘ఖేలో ఇండియా’లో జిల్లాకు దక్కని స్థానం ● చివరి ప్రయత్నాల్లో డీఎస్‌ఏ, క్రీడా సంఘాలు
ఖమ్మం స్పోర్ట్స్: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా జిల్లాకు ఒకటి, రెండు క్రీడాంశాల్లో పోటీల నిర్వహణ అవకాశం దక్కుతుందని క్రీడాకారులు, క్రీడాసంఘాల బాధ్యులు ఆశించారు. ఇంతలోనే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ షాక్ ఇచ్చింది. పోటీలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ వేదికగా నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో జిల్లా క్రీడాకారుల్లో నిరాశ అలుముకుంది.
రెండైనా కేటాయిస్తారా?
జిల్లాకు ఆర్చరీ, బ్యాడ్మింటన్ పోటీల నిర్వహణ అవకాశం దక్కేలా చూడాలని క్రీడా సంఘాలు బాధ్యులు మంత్రులను కోరుతున్నారు. ఈ రెండు క్రీడాంశాల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉన్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని శాయ్‌పై మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చే ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ఖేలో ఇండియా పోటీల నిర్వహణ కోసం వేదికలను ఎంపిక చేసేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ప్రతినిధులు వివిధ ప్రాంతాల్లో పరిశీలించారు. ఇందులో భాగంగా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంను కూడా ఇటీవల పరిశీలించగా అన్ని వసతులు ఉన్నందున ఆర్చరీ, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తారనే సంకేతాలు వచ్చాయి. ఈక్రమంలో క్రీడా సంఘాలు బాధ్యులు తమ వంతు ప్రయత్నం చేస్తుండగానే ఖమ్మం కాకుండా ఇతర వేదికలను ప్రకటించారు. ఇక్కడ పోటీలు నిర్వహిస్తే క్రీడా వసతులు మెరుగుపడతాయని, క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందనే భావనలో ఉన్న నేపథ్యాన నిరాశ ఎదురైంది. అయినా పట్టువీడకుండా ఆర్చరీ, బ్యాడ్మింటన్ పోటీల వేదికగా ఖమ్మంను ఖరారు చేయించేందుకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ, క్రీడా సంఘాల బాధ్యులు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నా క్రీడా పోటీల నిర్వహణకు అవకాశం దక్కకపోవడంపై క్రీడాకారుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.


