ఖమ్మంగాంధీచౌక్: ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. అంతేకాక ప్రజలు, భక్తులకు ఇబ్బంది కలగకుండా నిమజ్జన ఏర్పాట్లపై ఇప్పటి నుంచే దృష్టి సారించాలని తెలిపారు. ఖమ్మంలోని కాల్వొడ్డు, ప్రకాష్‌నగర్, ఖమ్మం రూరల్ మండలంలోని తీర్థాల ఆకేరు పరిసరాల్లో నిమజ్జన ప్రాంతాలను బుధవారం అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్తంభాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. వినాయక నిమజ్జానానికి అనువైన ప్రదేశాలు, నీటి మట్టం, రహదారులను పరిశీలించాక కలెక్టర్ మాట్లాడారు. భక్తుల మనో భావాలకు అనుగుణంగా అవసరమైన వసతులు కల్పించడమే కాక ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, నిమజ్జన ప్రాంతాల్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, బారికేడ్లు, తాగునీరు, మొబైల్ టాయిలెట్లు సమకూర్చాలని, ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ రామాంజనేయులు, జల వనరుల శాఖ సీఈ వసంతి, ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఏసీపీలు రమణమూర్తి, తిరుపతిరెడ్డి, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఏ.శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ జయచందర్ తదితరులు పాల్గొన్నారు.
నిమజ్జన ఘాట్లను పరిశీలించిన
కలెక్టర్ దివాకర


