● ప్రత్యర్థుల దాడిని తిప్పి కొట్టడానికి సరైన ఆయుధం ● కాంగ్రెస్ పీఏసీ సమావేశంలో మంత్రి పొంగులేటి ● పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఎమ్మెల్యేలు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా రాష్ట్రప్రభుత్వంపై చేస్తున్న అసత్య విమర్శలను తిప్పి కొట్టడానికి సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా పీఏసీ సమావేశం బుధవారం ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, వాటిపై చర్యలు, పురోగతిని సమీక్షించాక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరించాలన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి సచిన్ సావంత్ ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(సర్) రెండో దశపై దిశానిర్దేశం చేసి మాట్లాడుతూ అసెంబ్లీ కోఆర్డినేటర్లు, మండల, డివిజన్ అధ్యక్షులు, బూత్ లెలల్ సూపర్‌వైజర్లు, ఏజెంట్లకు స్పష్టమైన బాధ్యతలు కేటాయించి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈనెల 25 నాటికి మండల, టౌన్, గ్రామ స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా భయపడేలా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని సూచించారు. భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పన కోసం కోర్ టీమ్‌ను ఏర్పాటు చేసి, ప్రతీనెలా ప్రగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ భద్రాద్రి, ఖమ్మం జిల్లా, నగర అధ్యక్షులు దేవీప్రసన్న, నూతి సత్యనారాయణ గౌడ్, నాగండ్ల దీపక్‌చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్‌నాయక్, పాయం వెంకటేశ్వర్లు, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, వ్యవసాయ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సుడా, గ్రంథాలయ సంస్థ, మార్కెట్ చైర్మన్లు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖాదర్ బాబా, యరగలర్ల హన్మంతరావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్లు కాపా చంద్రకళ, ధరావత్ మోహన్‌నాయక్, రెహనాబేగం, నాయకులు దొబ్బల సౌజన్య, సయ్యద్ గౌస్, డాక్టర్ కాపా మురళీకృష్ణ సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.


