● బేతుపల్లిలో కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ● నేడు సమీక్షించనున్న మంత్రి పొంగులేటీ
సత్తుపల్లి: పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన సత్తుపల్లి మండలం బేతుపల్లి రెవెన్యూలో భూముల రీ సర్వే వేగంగా సాగుతోంది. రెవెనూ పరిధిలోని 12,047 ఎకరాలకు గాను ఇప్పటికే 6,110 ఎకరాలు ఎంజాయ్‌మెంట్ సర్వే పూర్తి చేశారు. మరో 5,937 ఎకరాల సర్వే కూడా త్వరగా పూర్తిచేసేలా ఉద్యోగులు శ్రమిస్తున్నారు. ఇక్కడ 12,047 ఎకరాలకు గాను రెవెన్యూ రికార్డుల్లో 17వేల ఎకరాలుగా నమోదవడంతో అర్హులైన రైతులకు పాస్‌పుస్తకాలు రాక ఇబ్బంది పడుతున్నారు. భూప్రక్షాళన సమయంలో ధరణి పోర్టల్‌లో అదనంగా 5వేల ఎకరాలకుపైగా నమోదు కావడం సమస్యకు కారణమైంది. ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యల పరిష్కారం కోసం రీ సర్వే చేస్తుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, ఆధునిక పరికరాలతో చేపడుతున్న రీ సర్వే పూర్తయ్యాక భూయజమానులకు కచ్చితమైన సరిహద్దులు, ఇతర వివరాల మ్యాప్‌తో పాస్‌బుక్ జారీ చేయడమే కాక భూ ఆధార్ నెంబర్ జారీ చేస్తారు.
నిత్యం కలెక్టర్ ఆరా
బేతుపల్లి రెవెన్యూ రీ సర్వే పకడ్బందీగా సాగేలా కలెక్టర్ దివాకర నిత్యం ఆరా తీస్తున్నారు. అంతేకాక ఇప్పటివరకు ఐదు సార్లు ఆయన సత్తుపల్లిలో తహసీల్‌లో సమీక్షంచడమే కాక రెండు సార్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. అలాగే, ప్రతీరోజు సర్వే ఆరా తీస్తూ రెవెన్యూ, సర్వే బందాలకు సూచనలు చేస్తున్నారు.
పరిశీలించనున్న మంత్రి పొంగులేటి
ఇటీవల సత్తుపల్లిలో జరిగిన ప్రజాదర్బార్‌లో బేత్తుపల్లి భూముల సమస్యను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ వివరించారు. దీంతో రీ–సర్వేకు ఆదేశించగా.. 10 సెక్టార్లుగా విభజించి ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి, చెరువులు, కుంటలు, రోడ్లు, గ్రామ నక్షాల సర్వే మొదలుపెట్టారు. ఇప్పటికే 2,651 మంది రైతుల 6,110 ఎకరాల వ్యవసాయ భూముల సర్వే పూర్తి చేశారు. కాగా, గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే కాక అధికారులు, రైతులతో సమీక్షించనున్నారు.


