కారు ఢీకొని లారీ క్లీనర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని లారీ క్లీనర్‌ మృతి

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

మోతె: కారు ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాల పాలైన లారీ క్లీనర్‌ మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం స్టేజీ వద్ద బుధవారం రాత్రి జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి బొగ్గు లోడ్‌తో హైదరాబాద్‌ వెళ్తున్న లారీ డ్రైవర్‌, క్లీనర్‌ రాఘవాపురం స్టేజీ వెంట ఉన్న హోటల్‌ వద్ద ఆగారు. సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన క్లీనర్‌ పాలకుర్తి జయరాజు(45) భోజనం చేసేందుకు రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్‌ వైపు నుంచి ఖమ్మం వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఘటనలో జయరాజు అక్కడికక్కడే మృతి చెందగా, అంతలోనే మరో కారు ఆయన మృతదేహం పైనుంచి వెళ్లడంతో ఛిద్రమైంది. ఈమేరకు లారీ డ్రైవర్‌ దైద రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు మోతె ఎస్‌ఐ బి.లచ్చిరెడ్డి తెలిపారు.

డ్రైవర్‌ క్యాబిన్‌పై పడిన గ్రానైట్‌ రాయి

నేలకొండపల్లి: లారీ డివైడర్‌ను ఢీకొనగా వెనుక భాగాన సరైన రక్షణ చర్యలు లేకుండా అమర్చిన గ్రానైట్‌ బండ డ్రైవర్‌ క్యాబిన్‌పై పడిన ఘటన ఇది. నేలకొండపల్లి నుంచి ఖమ్మం వైపు బుధవారం తెల్లవారుజామున గ్రానైట్‌ లారీ వెళ్తుండగా గువ్వలగూడెం – గోకినేపల్లి మధ్య జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు డివైడర్‌ను డీకొట్టింది. దీంతో గ్రానైట్‌ రాళ్లు క్యాబిన్‌పై పడటంతో డ్రైవర్‌ నాగరాజు అందులో ఇరుక్కున్నారు. నేషనల్‌ హైవే సిబ్బంది చేరుకుని అద్దాలు పగలగొట్టి గాయపడిన డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. టైర్‌ పంక్చర్‌ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నా, లారీల్లో అధిక లోడ్‌, సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా గ్రానైట్‌ తరలిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలున్నాయి.

బిర్యానీ సెంటర్‌ యజమానిపై దాడి

సత్తుపల్లి: సత్తుపల్లి పాత సెంటర్‌లోని సిద్దారం రోడ్డు పక్కన ఉన్న సలామ్‌ దమ్‌ బిర్యానీ హోటల్లో మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణపై కేసు నమోదైంది. కిష్టారం గ్రామానికి చెందిన పలగాని ఉపేందర్‌ హోటల్‌లో నాలుగు లెగ్‌ పీసులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లగా ఒకటి దుర్వాసన వచ్చింది. దీంతో ఆయన సెంటర్‌ నిర్వాహకుడు రామనాథ ఏడుకొండలుతో వాగ్వాదానికి దిగి దాడి చేయడమే కాక సెంటర్‌లోని బిర్యానీ రోడ్డుపై వేసి కుర్చీలు, కౌంటర్‌ ధ్వంసం చేశాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడమే కాక పోలీసులకు అందిన ఫిర్యాదుతో ఉపేందర్‌పై బుధవారం కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement