కొణిజర్ల: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అతివేగంతో నడిపి ఓ ఆటో, లారీని ఢీకొట్టిన ఘటన మండల పరిధిలోని తనికెళ్ల సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న మధిర డిపో ఆర్టీసీ హైర్ బస్సు ముందు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో వైరా నుంచి ఖమ్మం వస్తున్న ఆటోను ఢీ కొట్టడంతోపాటు అదే వేగంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చింతకాని మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన సింగారపు గోపి ఆటోనడుపుతుండగా ఆటో పల్టీలు కొట్టడంతో గోపి చేతికి తీవ్రగాయమైంది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆటోను పైకి తీయించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. గోపి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


