నేలకొండపల్లి: కుటుంబ సభ్యులు ఆస్తి అనుభవిస్తూ అన్నం పెట్టకుండా గెంటేశారని ఓ వృద్ధురాలు ప్రజావాణిలో అధికారులకు విన్నవించింది. ఎంపీడీఓ ఎం.యర్రయ్య అధ్యక్షతన ప్రజావాణి జరగగా 16 సమస్యలపై దరఖాస్తులు అందాయి. ఎనిమిదింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. హెల్ప్ డెస్క్, వైద్య శిబిరం, తాగునీటి వసతి కల్పించినా.. వీల్‌చైర్లు లేక దివ్యాంగులు ఇబ్బంది పడ్డారు. చెన్నారం గ్రామానికి చెందిన వృద్ధురాలు సీతమ్మ తన రెండెకరాల భూమి స్వాధీనం చేసుకుని అన్నం పెట్టకుండా వెళ్లగొట్టారని ఫిర్యాదు చేయగా, కోనాయిగూడెం పాఠశాల హెచ్‌ఎం దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే, రాజేశ్వరపురం ఆలయ భూముల ఆక్రమణ, దివ్యాంగులకు వాహనాల మంజూరు తదితర సమస్యలపై ఫిర్యాదులు అందాయి.


