ఆశ చూపి స్వాహా
● జిల్లాలో జోరుగా సాగుతున్న మట్కా? ● ఆన్‌లైన్‌లో ఆట.. చేతులు మారుతున్న రూ.లక్షలు ● మధ్యతరగతి జనాలు, కూలీలే లక్ష్యం
ఖమ్మంక్రైం: ఒకప్పుడు పేకముక్కలు, చీటీల ఆధారంగా నడిచి మట్కా జూదం అంతమైందని అంతా భావించారు. కానీ చేతికి అందిన సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా ఆన్‌లైన్‌లో ఆట మొదలుకావడం.. ఇందుకు పేద, మధ్యతరగతి జనాలు, కూలీలే ఆకర్షితులు అవుతుండడంతో ఏజెంట్లు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం మొదలు పల్లెపట్నం తేడా లేకుండా మట్కా జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీ చేయగా రహస్యంగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ మట్కా కేంద్రాన్ని గుర్తించారు. చాన్నాళ్లుగా ఆన్‌లైన్‌లో ఇది నడుస్తోందని.. చేతిలో ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఆడే అవకాశం ఉండడంతో కొందరు సులువుగా డబ్బు సంపాదించొచ్చనే ఆశతో పనులు వదులుకుని ఇటు మొగ్గు చూపుతున్నారు. అయితే, సంపాదన మాటేమో కానీ ఉన్న నగదు కాస్త పోగొట్టుకుని చివరకు రోడ్డు పాలవుతున్నారు. చిన్నచిన్న షాపులే అడ్డాగా కొందరు.. లాడ్జీలు, హాటళ్లలో గదులు అద్దెకు తీసుకుని ఇంకొందరు ఏజెంట్లు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్ల ద్వారా మట్కా జూదం నడిపిస్తున్నట్లు సమాచారం.
ముంబై, కళ్యాణి కేంద్రాలుగా..
మట్కా ఆట మహారాష్ట్రలోని ముంబై, కళ్యాణి కేంద్రాలుగా దేశ వ్యాప్తంగా ఏళ్ల తరబడి నడుస్తోంది. అయితే గతంలో కొత్తగూడెం కేంద్రంగా ఏజెంట్లు ఉమ్మడి జిల్లా అంతా నడిపించేవారు. కానీ ఇప్పుడు ఎవరూ క్షేత్రస్థాయిలో కనిపించకుండానే బుకీలుగా ఏర్పడి ఆన్‌లైన్‌లో సాగిస్తున్నారు. చివరకు నగదు చెల్లింపులకు సైతం డిజిటల్ పేమెంట్ యాప్‌లో వాడుతుండడంతో... ఎక్కడైనా హోటళ్లు, లాడ్జీల్లో పట్టుబడినా పోలీసులకు ఆనవాళ్లు దొరకడం లేదని తెలుస్తోంది. పైకి పైసా కానరాకున్నా రహస్యంగా సాగే ఈ ఆటలో నిత్యం రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది.
ఆన్‌లైన్‌లో మట్కా జరుగుతోందనే సమాచారంతో పూర్తిస్థాయిలో దృష్టి సారించాం. దందాను గుర్తించి అరికట్టేందుకు ప్రత్యేక బృందం నిరంతరంగా పనిచేస్తోంది. ఆన్‌లైన్ మట్కాతో పాటు చీటీల ఆధారంగా నడుస్తుందనే సమాచారం తెలిస్తే డయల్ 100కు తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెల్లడి కావు.
– రమణమూర్తి, ఖమ్మం నగర ఏసీపీ
రూపాయి పెడితే రూ.100, రూ.100 పెడితే రూ.వేయి వస్తాయంటూ మట్కా దందాలో ఏజెంట్లు ప్రజలను ఆకర్షిస్తుంటారు. ఇందులో వివిధ పేర్లతో ప్యానళ్లు ఉండగా.. ఒకటి, రెండు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయని సమాచారం. రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రితో పాటు అర్ధరాత్రి కూడా క్లోజింగ్ ప్యానల్ ఉంటుందని చెబుతారు. ప్యానళ్ల వారీగా సింగిల్ డిజిట్‌లో రూ.11కు 100, డబుల్ డిజిట్‌లోనైతే రూ.11కు 500, త్రిబుల్ డిజిట్‌లో రూ.11కు రూ.1,400 గెలుచుకోవచ్చని బుకీలు ఆశ చూపిస్తారు. దీంతో కలిసొస్తే ఒకేరోజు రూ.వేలు మొదలు రూ.లక్షల్లో సంపాదించుకోవచ్చన్న ఆశతో సాధారణ ప్రజలు చాలామంది ఆకర్షితులు అవుతున్నారని తెలుస్తోంది. మధ్య తరగతి జనం, కూలీ పనులు చేసుకునే వారే కాక విద్యార్థులు కూడా ఏజెంట్ల మాయలో పడి ఉన్నదంతా పోగొట్టుకోవడమే కాక అప్పుల పాలవుతున్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్లే ఆన్‌లైన్ మట్కా దందా పెరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా పోలీసులు స్పందించకపోతే జూదం మరింత పెరిగే అవకాశమున్నందున ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లావాసులు కకోరుతున్నారు.


