షాప్‌ లేదు.. ఆన్‌లైన్‌లో ఉంది! | - | Sakshi
Sakshi News home page

షాప్‌ లేదు.. ఆన్‌లైన్‌లో ఉంది!

Aug 18 2026 12:51 AM | Updated on Aug 18 2026 12:51 AM

ముదిగొండ: ఎరువుల బుకింగ్‌ కోసం ముదిగొండ మండల రైతులు కొందరు యాప్‌ద్వారా ప్రయత్నించగా వల్లభిలో రామ్‌సాయి పేరుతో ఎరువుల దుకాణం కనిపించింది. అందులో యూరియా స్టాక్‌ కూడా ఉండడంతో పలువురు బుక్‌ చేసుకున్నారు. ఆతర్వాత వల్లభికి వెళ్లేసరికి ఆ పేరుతో షాపే లేదని తేలడంతో అవాక్కవాల్సి వచ్చింది. అనంతరం అధికారులను కలిసేందుకు వెళ్లగా వారు అందుబాటులో లేరని వాపోయారు. ఈ విషయమై ఏఓ సరితను వివరణ కోరగా సర్వర్‌లో లోపాలు ఉన్నాయని, మధిరలో కూడా ఇదే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ యాప్‌ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిదని పేర్కొన్నారు. ఈమేరకు అందుబాటులో ఉన్న షాపుల్లో బుకింగ్‌ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.

రేపు టీటీడీసీలో

జాబ్‌మేళా

ఖమ్మం రాపర్తినగర్‌: నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 19న జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్‌.మాధవి తెలిపారు. ఎల్‌ఐసీలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లు, ఇండూ స్ల్యాండ్‌లో లైఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, కీర్తన గోల్డ్‌ లోన్స్‌లో లోన్‌ ఆఫీసర్లు, రిలేషన్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఆయా కంపెపనీల బాధ్యులు అర్హులను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఎస్సెస్సీ మొదలు డిగ్రీ వరకు విద్యార్హత కలిగి, 18 – 40 ఏళ్ల వయస్సు వారు ఖమ్మం టీటీడీసీలో బుధవారం జరిగే జాబ్‌ మేళాకు హాజరుకావొచ్చని తెలిపారు. వివరాలకు 81434 20505, 96188 90789, 81067 90700 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ఖమ్మం సహకారనగర్‌: ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య పథకం అమలులో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేర్ని వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఖమ్మంలోని పెన్షనర్స్‌ భవన్‌లో సోమవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పెన్షనర్ల ఆరోగ్య పథకం అమలులో లోపాలు సరిచేయడంతో పాటు పీఆర్సీ, డీఏలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, పంచాయతీరాజ్‌ టీచర్స్‌ పెన్షనర్ల సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్‌రెడ్డి, సుంకర భిక్షంగౌడ్‌, జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు, నాయకులు తాళ్లూరి వేణు, వి.శ్రీనివాసరావు, వెంకటనారాయణ, సుబ్బయ్య పాల్గొన్నారు.

కోల్డ్‌ స్టోరేజీల్లో

మిర్చి విక్రయాలకు బ్రేక్‌

పలువురు వ్యాపారులకు నోటీసులు

ఖమ్మంవ్యవసాయం: మిర్చి కొనుగోళ్లలో ఆర్‌డీ(రేట్‌ డిఫరెన్స్‌) వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉండడంతో రాష్ట్రంలోని కోల్డ్‌ స్టోరేజీల్లో క్రయవిక్రయాలు, కార్యకలాపాలను వ్యాపారులు నిలిపివేశారు. మిర్చి కొనుగోళ్ల సమయాన వ్యాపారులు ధరలు తగ్గించి నమోదు చేస్తూ మార్కెట్లు, ప్రభుత్వానికి పన్ను తక్కువగా చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఖమ్మం మార్కెట్‌లో నియంత్రించడంతో వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు నిలిపివేయగా ప్రభుత్వ ఆదేశాలతో కోల్డ్‌స్టోరేజీల్లో తనిఖీ చేపట్టారు. అక్రమాలు తేలడంతో ప్రభుత్వానికి ఇవ్వగా చర్యలు తీసుకునే అవకాశం ఉండడంతో కోల్డ్‌ స్టోరేజీలను మూసివేశారు. ఫలితంగా తనిఖీకి వెళ్లినఅధికారులకు నిరాశ ఎదురవుతోంది. మరోపక్క ఖమ్మం జిల్లాలోని పలు మార్కెట్ల పరిధి కోల్డ్‌ స్టోరేజీల్లో లైసెన్సు లేని వ్యాపారులు మిర్చి కొనుగోళ్లు చేసినట్లు తనిఖీ బృందాలు గుర్తించాయి. ఈమేరకు వైరా మార్కెట్‌ పరిధిలోని ఆరుగురికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

పుష్కరాల పనుల్లో వేగం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): గోదావరి పుష్కరాల పనుల్లో వేగం పెంచాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి సోమవారం గోదావరి పరీవాహక జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పుష్కరాల సన్నద్ధ తపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరాల నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించా లని చెప్పారు. అలాగే, భద్రాచలం శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు వేగంగా చేపడుతూ డిసెంబర్‌ నాటికి ఉత్తర ద్వార దర్శనం పనులు పూర్తి చేయాలని సూచించారు. భద్రాద్రి కలెక్టరేట్‌ నుంచి హాజరైన కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement