కూసుమంచి: మండలంలోని పాలేరులోని మత్స్య పరిశోధనా కేంద్రంలో మత్స్యకారులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన మత్స్యకారులు, మత్స్య రైతులకు తొలిరోజు బయోప్లాక్ విధానంలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యకారులు నూతన సాంకేతిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని వృద్ధి చేసుకోవాలని పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్ కోరారు. శాస్త్రవేత్తలు రవీందర్, దివ్య పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు.
రైస్‌మిల్లులో విజిలెన్స్ అధికారుల తనిఖీ
సత్తుపల్లిటౌన్: సత్తుపల్లి మండలం తాళ్లమడలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి రైస్ మిల్లులో సోమవారం వరంగల్ నుంచి వచ్చిన విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. విజిలెన్స్ తహసీల్దార్ లక్ష్మణ్, ఇన్‌స్పెక్టర్ రాకేష్ తమ సిబ్బందితో కలిసి ధాన్యం నిల్వలు, రికార్డులను పరిశీలించారు. ప్రత్యక్షంగా ఉన్న నిల్వలు, రికార్డుల్లోని వివరాలను సరిచూసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వారు పేర్కొన్నారు.
20న అథ్లెటిక్స్
ఎంపిక పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 20వ తేదీన పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షఫీక్ అహ్మద్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో అండర్–14, 16, 18, 20 కేటగిరీల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయసు ధ్రువీకరణపత్రంతో పాటు ఆధార్ కార్డుతో హాజరుకావాలని, ఇక్కడ ఎంపిక చేసే జట్లు ఈనెల 26, 27వ తేదీల్లో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని ఆయన తెలిపారు.
ట్రెయినీ డీటీ బలవన్మరణం
మహబూబాబాద్ రూరల్: రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దార్‌గా శిక్షణ పొందుతున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అద్దె ఇంట్లో నివాసముండే డోలి వెంకటేశ్వర్లు – పద్మ దంపతుల కుమార్తె సంధ్య (28) డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికై ంది. ఖమ్మం జిల్లాలో శిక్షణ పొందుతూ ఉద్యోగం చేస్తున్న ఆమె సోమవారం సాయంత్రం తల్లిదండ్రులు లేని సమయాన ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కాసేపయ్యాక వచ్చిన తల్లిదండ్రులకు ఇచ్చిన సమాచారంతో టౌన్ సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వర్లు, సూరయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, సంధ్య ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.


