ఖమ్మం వైద్యవిభాగం: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు మాధవి క్లినిక్, డాక్టర్ హెల్త్ హోమియోపతి, మిత్ర డయాగ్నస్టిక్ సెంటర్లలో తనిఖీ చేసిన ఆయన వైద్యసేవలు, వైద్యులు, సిబ్బంది వివరాలు, రికార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫైర్ సేఫ్టీ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఔషధాల నిల్వలపై ఆరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఆస్పత్రిలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. కాగా, ఆస్పత్రుల్లో తనిఖీ సందర్భంగా లోపాలపై వివరాలు సమర్పించాలని సూచించారు.
యాంటీ బయాటిక్స్ వినియోగంలో జాగ్రత్త
యాంటీబయాటిక్స్‌ను అవసరం ఉన్నప్పుడు, వైద్యుల సూచన మేరకు సరైన మోతాదులో వినియోగించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు సూచించారు. సాధారణ జలుబు, ఫ్లూ వంటి వైరస్‌ల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లకు స్వయంగా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ప్రయోజనం లేకపోగా, అనర్థాలు ఎదురవుతాయని తెలిపారు. వ్యాధి ఎక్కువకాలం కొనసాగడం, ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఎదురవడంతో పాటు చికిత్స ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈమేరకు వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడొద్దని, సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.


