● ఆటలో ఓడిపోయామని ఇంటర్ విద్యార్థుల ఆగ్రహం ● ఎస్సెస్సీ విద్యార్థులపై దాడి, అడ్డొచ్చిన ఉపాధ్యాయుడికీ గాయాలు
కారేపల్లి: కారేపల్లి మండలం గాంధీనగర్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల విద్యాలయం, కళాశాలలో శనివారం రాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కొన్ని క్రీడాపోటీల్లో ఎస్సెస్సీ విద్యార్థులు ఓడిపోగా వారిని ఇంటర్ విద్యార్థులు గేలిచేశారు. మరికొన్ని పోటీల్లో ఎస్సెస్సీ విద్యార్థులు గెలవడాన్ని జీర్ణించుకోలేక ఇంటర్ విద్యార్థులు దాడికి తెగబడ్డారు. భయంతో పదో తరగతి విద్యార్థులు పరుగులు తీసినా వదలకుండా దాడి చేయడంతో 15మంది గాయపడగా, అడొచ్చిన నైట్‌డ్యూటీ ఉపాధ్యాయుడు గౌష్‌పాషా, వాచ్‌మెన్ శ్రీనును నెట్టేయడంతో గౌస్‌పాషా చేతికి గాయమైంది.
ఆటల పోటీలతో గొడవ..
పంద్రాగస్టు సందర్భంగా గురుకులం విద్యార్థులకు కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో పోటీలు నిర్వహించారు. వాలీబాల్, ఖో–ఖో పోటీల్లో ఇంటర్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. దీంతో ఎస్సెస్సీ విద్యార్థులపై వారు ఈవ్‌టీజింగ్‌కు పాల్పడ్డారు. ‘మీరు ఓడిపోయారు, గాజులు వేసుకోండి రా.. చీరలు కట్టుకోండి రా.. మీరంతా ఆడంగి వాళ్లు’అంటూ ర్యాగింగ్ చేశారు. ఆపై కబడ్డీ పోటీల్లో మాత్రం ఎస్సెస్సీ జట్టు గెలవడంతో ఇంటర్ విద్యార్థుల ముందే వారు వేడుక చేసుకున్నారు. ఈక్రమాన కొందరు విద్యార్థులు గతంలో ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలిసింది. దీంతో పదో తరగతి విద్యార్థుల చేతులో ఓడిపోవడాన్ని అవమానకరంగా భావిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిశాక శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థులు ఎస్సెస్సీ విద్యార్థుల హాస్టల్ రూమ్‌లోకి వెళ్లి ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అంతేకాక విచక్షణా రహితంగా దాడి చేయడంతో భరత్‌నాయక్, సందీప్, హర్షవర్ధన్, దిలీప్, విజయ్, మోహన్‌దాస్, అన్వేష్, బాజి, జంపన్న, లక్ష్మీనరసింహా, దేవేందర్ తదితరులకు గాయాలయ్యాయి.
దెబ్బలకు తాళలేక పరుగులు..
దెబ్బలకు తాళలేక పదో తరగతి విద్యార్థులు హాస్టల్ నుంచి బయటకు వచ్చి సమీపంలోని గుట్టపైకి, రైల్వే స్టేషన్ వైపు, సమీప బస్వాపురం వైపు పరుగులు తీశారు. రాత్రంతా అక్కడే బిక్కుబిక్కుమంటూ దాక్కున్నారు. ఈక్రమాన విద్యార్థులు అరుపులు విన్న బస్వాపురం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు చేరుకోగా ఇంటర్ సెకండియర్ విద్యార్థులు పరారయ్యారు. కాగా, ఘర్షణ విషయం తెలియగానే పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం ఉదయం గురకులాలనికి చేరుకుని పిల్లల శరీరంపై గాయాలు చూస్తూ రోదించారు. ‘మేము ఈ స్కూల్‌లో చదవలేం. ఇక్కడే ఉంటే ఇంటర్మీడియట్ విద్యార్థులు చంపేస్తారు.. మా సార్లను కూడా కొట్టుతున్నారు’అంటూ విద్యార్థులు రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది. దీంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ విషయం తెలిసి కారేపల్లి ఎస్‌ఐ బి.గోపి, సిబ్బంది చేరుకుని తల్లిదండ్రులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఉన్నతాధికారుల సూచనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నచ్చచెప్పి పంపించారు.


