ఖమ్మంమయూరిసెంటర్: భవన, ఇతర నిర్మాణ కార్మికులు చెమటోడ్చి సేకరించిన సెస్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించడాన్ని తక్షణమే అరికట్టాలని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం(టీయూసీఐ) రాష్ట్ర కార్యదర్శి సాంబశివుడు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు పేరబోయిన వెంకన్న ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎస్‌సీ మెడికల్ టెస్ట్‌లు, ప్రైవేట్ బీమా పేరుతో కార్మికులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏటీసీ(ఐటీఐ) పరిధిలోని 65 కాలేజీలకు కార్మికుల సెస్ నుంచి రూ.667 కోట్లు కేటాయించడం అన్యాయమని పేర్కొన్నారు. ఇందులో చదివే విద్యార్థులకు సాధారణ బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వాలే తప్ప సెస్ ఎలా వాడతారని ప్రశ్నించారు. అలాగే, 60ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.9 వేల పింఛన్, సహజ మరణానికి ఇచ్చే పరిహారం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు, ప్రసూతి (డెలివరీ), వివాహ ప్రయోజనాన్ని రూ.లక్షకు పెంచాలన్నారు. ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు డోనోజి లక్ష్మయ్య, ముద్దాం శ్రీనివాసులు, గాదె లక్ష్మీనారాయణ, బండి రవి, గోస్ పుల్లయ్య, శీలం లెనిన్, గొడుగు విజయ్, కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


