వాణిజ్య పంటలతోనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

వాణిజ్య పంటలతోనే అభివృద్ధి

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల ● అంజనాపురంలో గోద్రెజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

అక్కయ్యా... పథకాలు అందుతున్నాయా?

● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల ● అంజనాపురంలో గోద్రెజ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీ ప్రారంభం

కొణిజర్ల: వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ అంశాన్ని తమ ప్రభుత్వం పరిగణనోకి తీసుకుని పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తోందని చెప్పారు. ఇదే సమయాన రైతుల ఆర్థిక స్థిఽతిగతులు మెరుగుపడాలంటే సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని సూచించారు. కొణిజర్ల మండలం అంజనాపురంలో రూ.300 కోట్ల వ్యయంతో గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ సంస్థ నిర్మించిన సమీకృత ఆయిల్‌ పామ్‌ కాంప్లెక్స్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మర్‌ నాదిర్‌ బి.గోద్రెజ్‌లతో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఫ్యాక్టరీలో గెలల ప్రాసెసింగ్‌ యూనిట్లు, నియంత్రణ వ్యవస్థను పరిశీలించాక భట్టి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతులు వినూత్న పంటల సాగుకు చిరునామాగా నిలుస్తున్నారని తెలిపారు. జిల్లాలు విడిపోయాక ఫ్యాక్టరీలు, సింగరేణి సంస్థ భద్రాద్రి జిల్లాలోకి వెళ్లడంతో ఖమ్మం జిల్లా రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రైతుల ఆదాయం పెరగాలంటే వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని తెలిపారు. 2023లో టన్ను పామాయిల్‌ గెలల ధర రూ.12 వేలు ఉంటే ప్రస్తుతం రూ.23 వేలకు చేరడంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కొణిజర్ల మండలంలో పామాయిల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడం రైతులకు వరమని తెలిపారు. ఈ కాంప్లెక్స్‌లో సీడ్‌ గార్డెన్‌, మిల్లింగ్‌ మిషన్‌, రిఫైనరీ ఏర్పాటు చేయడం విశేషమన్నారు. ఇక్కడి సీడ్‌ గార్డెన్‌ దేశానికే నాణ్యమైన పామాయిల్‌ విత్తనాలు అందించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. .

పామాయిల్‌ హబ్‌గా తెలంగాణ

ఆయిల్‌పామ్‌ సాగులో గణనీయంగా పురోగతి సాధిస్తున్న తెలంగాణ రానున్న ఐదేళ్లలో దేశానికి హబ్‌గా మారనుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి జిల్లాకే పరిమితం అయిన ఈ పంట నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగవుతోందని చెప్పారు. ప్రత్యేగా సీడ్‌ గార్డెన్‌తో పాటు పరిశోధనా కేంద్రం, రైతులకు అవగాహన కలిపించడానికి సమాఽధాన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గంటకు 30 టన్నుల ఆయిల్‌ క్రషింగ్‌ సామర్ధ్యం కలిగిన ఈ ఫ్యాక్టరీని దశల వారీగా 120 టన్నులకు చేర్చనుండగా, 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు.

మహిళల పాత్ర పెరగాలి

గోద్రెజ్‌ సంస్థఽల చైర్‌పర్సన్‌ నాదిర్‌ బి.గోద్రెజ్‌ మాట్లాడుతూ ఆయిల్‌ పామ్‌ సాగులో మహిళలు భాగస్వాములు కావాలని సూచించారు. మహిళల పాత్ర పెరిగితేతే దేశం వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుందని చెప్పారు. అంజానాపురంలోనే త్వరలో ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అనంతరం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ బి.సురేంద్రమోహన్‌, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ మాట్లాడగా గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ వైస్‌ చైర్మన్‌ బుర్జీన్‌ ఎన్‌.గోద్రెజ్‌, గ్రూప్‌ ప్రెసిడెంట్‌ రాకేష్‌ స్వామి, ఎండీ, సీఈఓ సునీల్‌ కటారియా, ఆయిల్‌పామ్‌ సీఈఓ సౌగత నియోగి, దీపాంశుగుప్తా, ఉద్యాన శాఖ డైరక్టర్‌ యాస్మిన్‌ బాషా, టీజీ పెడ్‌ చైర్మన్‌ పవన్‌కుమార్‌, కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌., సీపీ సునీల్‌దత్‌, సర్పంచ్‌లు అంబడిపూడి కమలమ్మ, భూక్యా సునీత తదితరులు పాల్గొన్నారు.

వైరా: కొణిజర్ల మండల పర్యటన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాల లక్ష్మీపురం వెళ్లారు. మార్గమధ్యలో వ్యవసాయ పనులు చేస్తున్న మహిళా కూలీలు కనిపించగా కారు ఆపి మాట్లాడారు. ‘అక్కయ్యా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా, ఉచిత విద్యుత్‌ సరఫరా ఉందా.. రేషన్‌ దుకాణం నుంచి సన్న బియ్యం తెచ్చుకుంటున్నారా.. అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయా..’ అని ఆరా తీశారు. దీంతో కూలీలు పథకాలు అందుతున్నాయని తెలిపారు. అయితే, వైరా నుంచి ముసలిమడుగుకు రవాణా సౌకర్యం లేక ఆటోలు సైతం సరిగా ఉండవని చెప్పిన కూలీలు కూలీలు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరగా భట్టి సానుకూలంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement