ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వ్యాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన వ్యాన్‌

Jul 21 2026 12:17 AM | Updated on Jul 21 2026 12:17 AM

కల్లూరు రూరల్‌: కల్లూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదురుగా సోమవారం సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న సత్తుపల్లి డిపో బస్సును టాటా ఏస్‌ వ్యాన్‌ వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో టాటా ఏసీ డ్రైవర్‌, చండ్రుగొండ మండలం మధుకూరుకు చెందిన తురక లక్ష్మణరావుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనకు కల్లూరులో చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, బస్సులో ఉన్న ప్రయాణికులకు గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పినట్లయిది.

ఇసుక లారీ బోల్తా, డ్రైవర్‌కు గాయాలు

కొణిజర్ల: ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమాన ఇసుక లారీ బోల్తా పడింది. కొణిజర్ల మండలం గుబ్బగుర్తి సమీపాన సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాలు... భద్రాచలం నుంచి సూర్యాపేట జిల్లా కోదాడకు ఇసుక లోడ్‌తో లారీ వెళ్తోంది. గుబ్బగుర్తి సమీపాన మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని డ్రైవర్‌ తప్పించే యత్నంలో అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్లలో బోల్తా పడింది. లారీ క్యాబిన్‌ అద్దాలు చెట్టుకు తాకడంతో పగిలిపోగా, డ్రైవర్‌ సత్యనారాయణ కేబిన్‌లో చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు ఆయనను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

108 అంబులెన్స్‌ తనిఖీ

బోనకల్‌: బోనకల్‌, చింతకాని మండలాలకు సేవలందిస్తున్న 108 అంబులెన్స్‌ను ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌(ఈఎంఈ) ఆలేటి ప్రవీణ్‌కుమార్‌ సోమవారం తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో మందుల లభ్యత, పరికరాల పనితీరును ఆయన పరిశీలించారు. బాధితుల నుంచి వచ్చే ఫోన్లకు సత్వరమే స్పందించి ఘటనాస్థలికి వెళ్లడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించవచ్చని తెలిపారు. సిబ్బంది నండ్రు మనోహర్‌, కోట భానుసహాన్‌, ఎం.ఎం.చక్రవర్తి, కలసాని వెంకట్రావుతో మాట్లాడి పలు సూచనలు చేశారు.

పాదరక్షల షోరూమ్‌కు జరిమానా

ఖమ్మంలీగల్‌: నాణ్యత లేని పాదరక్షలతో అమ్మారని వినియోగదారుడు వేసిన కేసును విచారించిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ చైర్మన్‌ వి.లలిత, సభ్యురాలు మాధవీలత సోమవారంషోరూమ్‌ నిర్వాహకులకు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. వైరా మండలం తాటిపూడికి చెందిన న్యాయవాద క్లర్క్‌ లింగాల ప్రవీణ్‌కుమార్‌ సెంట్రో షోరూమ్‌లో 2025 ఆగస్టులో రూ.1,599 విలువైన పాదరక్షలు కొనుగోలు చేశాడు. రెండు, మూడు సార్లకే చెప్పుల సోల్‌, లెదర్‌ దెబ్బతిని మధ్యలో విరిగిపోయింది. దీంతో షోరూమ్‌లో సంప్రదిస్తే పట్టించుకోలేదు. ఈమేరకు ఆయన న్యాయవాదుల ద్వారా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈమేరకు పాదరక్షల కొనుగోలు ధరతో పాటు నష్టపరిహారం, ఇతర ఖర్చులు చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement