సత్తుపల్లి(పెనుబల్లి): దేవాలయాలనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను వీఎం.బంజర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమేరకు స్టేషన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వివరాలు వెల్లడించారు. కొంతకాలంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఏపీలోని పలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేసేందుకు సీఐ ముత్తిలింగయ్య, ఎస్సై కె.వెంకటేష్ ఆధ్వర్యాన ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయని తెలిపారు. ఈక్రమాన తల్లాడ గ్రామానికి చెందిన షేక్ జానీ, ఏపీలోని పోలవరం జిల్లాకు చెందిన పేరాల నరసింహారావుతోపాటు వీరికి సహకరించిన కొత్తగూడెంకు చెందిన ఆరవ ఉదయ్‌కుమార్ పట్టుబడ్డారని చెప్పారు. వీరు ఇళ్లతోపాటు కొత్తగూడెం హనుమాన్ దేవాలయం, ఉప్పలచెలకలోని అక్కమ్మ గుడి, రామాలయం, తల్లాడ మండలం అంజనాపురంలోని హనుమాన్ దేవాలయం, కల్లూరు మండలం గనియాతండాలోని హనుమాన్ దేవాలయం, వేంసూరు మండలం లింగపాలెంలోని హరి క్షేత్ర దేవాలయం, ఏపీలోని గోకవరం గంగాలమ్మ గుడి, పెనుబల్లి మండలం బయ్యనగూడెంలోని దేవాలయాల్లో బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేయగా, 24 గ్రాముల బంగారం, కారు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితులపై వివిధ కేసులతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేశామన్నారు. కాగా, నిందితులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన ఎస్సైలు వెంకటేష్, హరిత, కానిస్టేబుళ్లు నాగేంద్రం, వెంకటేశ్వర్లు, రాజమల్లు, మజీద్ పాషా, నరసింహారావు, శ్రీనివాసరావును ఏసీపీ అభినందించారు. కాగా, ఆలయాల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా భద్రత ఉంటుందని ఆమె తెలిపారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు


