ఖమ్మంవ్యవసాయం: ‘తేజ’ మిర్చి క్వింటా ధర ఎట్టకేలకు రూ.22 వేలకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న జెండా పాటలో ఇదే ధర నమోదు కాగా.. సరిగ్గా మూడు నెలలకు సోమవారం మళ్లీ గరిష్ట ధరకు చేరుకుంది. దాదాపు రెండు నెలలుగా రూ. 21,500 నుంచి రూ.21,900 మధ్య కొనసాగుతోంది. అయితే, కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన ఏసీ మిర్చిని సోమవారం తీసుకురాగా క్వింటాకు రూ.22 వేలు పలికింది. సీజన్‌లో రూ.18 వేల నుంచి రూ.19 వేలు ఉన్న ధర మే నెలలో రూ.20 వేలు, జూన్, జూలై నెలల్లో రూ.21 వేల మార్క్‌ను దాటింది. ఇక సోమవారం జెండా పాట రూ.22వేలుగా నమోదవగా, మోడల్ ధర రూ.21,600 పలికింది. అలాగే, నాన్ ఏసీ మిర్చికి రూ.17,400, తాలు మిర్చికి గరిష్టంగా రూ.10 వేల ధర పలుకుతోంది. వ్యవసాయ సీజన్ కావడంతో పెట్టుబడుల కోసం రైతులు మిర్చి విక్రయానికి ముందుకొస్తున్నారు.
ఎగుమతుల ఊపు
కొద్ది కాలంగా వివిధ ఉత్పత్తులకు డిమాండ్, ధరలు దృష్ట్యా మిర్చి ధర కూడా పెరుగుతోందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. మిర్చికి దేశీయంగానే కాక బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఈమేరకు ఖమ్మం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేసే మిర్చి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్‌లో నిత్యం సుమారు 10 వేల బస్తాల మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయి.


