‘విక్రమ్–1’ ప్రయోగంలో మాదాపురం వాసి
ముదిగొండ: ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన మోర్తాల నరేందర్‌రెడ్డి తన ప్రతిభతో భారత అంతరిక్ష రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి తొలిసారి ప్రయోగించిన ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1(ఆగమన్) ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఈ రాకెట్‌ను రూపొందించగా.. ఇందులో నరేందర్‌రెడ్డి టీమ్ లీడ్ – ఇంటిగ్రేషన్ – టెస్టింగ్ ఇంజనీర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించాడు. విక్రమ్–1 ప్రయోగ వాహనంలోని లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థల సమీకరణ, పరీక్షలు, ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక కార్యకలాపాలకు నాయకత్వం వహించాడు. కాగా, నరేందర్‌రెడ్డి తండ్రి హనుమిరెడ్డి రైతు కాగా, తల్లి లక్ష్మి, భార్య వెంకటదివ్య ఉన్నారు. ఆయన తమ్ముడు రాజశేఖర్‌రెడ్డి నెదర్లాండ్స్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండే నరేందర్‌రెడ్డి మామ ప్రోత్సాహంతో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి పదేళ్లకు పైగా అంతరిక్ష, రక్షణ రంగాల్లో అనుభవం సాధించాడు. ప్రస్తుతం విక్రమ్–1(ఆగమన్) ప్రయోగంలో పాలుపంచుకున్న ఆయనను మండల వాసులు అభినందించారు.


