పంద్రాగస్టు నాటికి
కార్పొరేట్ లుక్
● రూపురేఖలు మార్చేలా యంత్రాంగం సన్నాహాలు ● తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల కల్పనపై దృష్టి ● వచ్చేనెల 15 నాటికి పూర్తియడమే లక్ష్యంగా పనులు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చడం.. తద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో దశాబ్దాలుగా వేధిస్తున్న వసతుల కొరత తీర్చి, వాటిని ఆధునికీకరించే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్న కేంద్రాలతో పాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో కూడా విద్యుత్, రక్షిత తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు.
300కు పైగా కేంద్రాలకు విద్యుత్
జిల్లాలోని 1,840 అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించిన అధికారులు.. ఎక్కడెక్కడ ఏమేం మౌలిక వసతుల కొరత ఉందో నివేదిక రూపొందించారు. ఇందులో భాగంగా విద్యుత్ సౌకర్యం లేని కేంద్రాలు 316 ఉండగా, ప్రస్తుతం 246 కేంద్రాలకు సంబంధించి నివేదిక కలెక్టర్‌కు సమర్పించారు. ఎన్పీడీసీఎల్ అధికారుల సమన్వయంతో ఈ కేంద్రాలకు త్వరలోనే మీటర్లు బిగించనుండగా విద్యుత్ సరఫరా మొదలవుతుంది.
మరుగుదొడ్ల నిర్మాణం
చిన్నారులకు ఇబ్బంది లేకుండా చూడడం, బాలికల ఆరోగ్యం దృష్ట్యా 202 కేంద్రాల్లో కొత్తగా మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్(పీఆర్) శాఖకు అప్పగించి నిధులు కూడా మంజూరు చేశారు. దీంతో పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటికే మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాగా, ఇంకొన్ని చోట్ల పనులు కొనసాగుతున్నాయి.
‘మిషన్ భగీరథ’తో నీరు
జిల్లాలోని ఏజెన్సీ (వైరా, సత్తుపల్లి, పినపాక తదితర ప్రాంతాల సరిహద్దులు), గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు శుద్ధి చేసిన తాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ అధికారులను రంగంలోకి దించారు. ప్రతీ కేంద్రానికి నల్లా కనెక్షన్ ఇచ్చి, నిరంతరం రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు మిషన్ భగీరథ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా పరిశీలన పూర్తి చేసి పనులను పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక సమీక్ష
అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణపై కలెక్టర్ ఆదేశాలతో అదనపు కలెక్టర్ ఇటీవల ఐసీడీఎస్ అధికారులతో సమావేశమయ్యారు. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా ఉపాధి హామీ నిధులను కూడా అవసరమైన చోట మరుగుదొడ్ల నిర్మాణం, సదుపాయాల కల్పనకు అనుసంధానం చేస్తున్నారు.
ప్రస్తుతం పలు కేంద్రాల్లో తుది దశకు చేరిన పనులతో పాటు, కొత్తగా మౌలిక వసతుల కల్పన కోసం చేస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం గడువు విధించింది. రాబోయే ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ పనులన్నీ వంద శాతం పూర్తి చేసి, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా చిన్నారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. ఆధునికీకరణ పనులు పూర్తయితే జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ప్రైవేట్ ప్లే స్కూళ్లకు దీటుగా ముస్తాబు కానున్నాయి.


