ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 240 మంది క్రీడాకారులు పాల్గొనగా, విజేతలను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. విజేతలకు ఎస్‌బీఐటీ కరస్పాండెంట్ గుండాల కృష్ణ, రెజొనెన్స్ విద్యాసంస్థల చైర్మన్ ఆర్‌వీ నాగేంద్రకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు టి.వీరన్న, పి.శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలు. వరుసగా మొదటి మూడు స్థానాల్లో బి.క్రీతిక, జి.వివాంషిక, సాత్విక్ నిలవగా వీరికి ట్రోఫీలతో రూ.10 వేల చొప్పున నగదు బహుమతి అందజేశారు.
పీ.వీ.సింధుకు
అభినందనలు
ఖమ్మంస్పోర్ట్స్: జపాన్‌లో జరిగిన సూపర్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీ.వీ.సింధు తొలిసారిగా సింగిల్స్ టైటిల్ కై వసం చేసుకోవడంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బ్యాడ్మింటన్ సంఘం జిల్లా ప్రతినిధి సిరిపురపు సుదర్శన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు వారు ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. గత 43 ఏళ్లుగా ఈ టోర్నీలో భారత్ క్రీడాకారులు టైటిల్ దక్కించుకోలేదని, ఇప్పుడు తొలిసారి పీ.వీ.సింధు కై వసం చేసుకోవడం దేశానికే గర్వకారణమని ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘ఈశా’ క్రీడాపోటీలు..
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లాస్థాయి ఈశా గ్రామోత్సవంలో భాగంగా ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. క్లస్టర్–1 త్రోబాల్ పోటీల్లో కోయచెలక వారియర్, జై విజయ, విజయశక్తి, అంకమ్మ జట్లు వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. అలాగే, క్లస్టర్–2లో పాపటపల్లి, గాంధీజీ, ఆర్‌సీ సెంటర్, దివ్య జట్లు విజయం సాధించాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేయగా, సుభాన్, వాలీబాల్ కోచ్ నాగరాజు పాల్గొన్నారు.
010 పద్దు కింద వేతనాలు చెల్లించాలి
టీఎస్ ఎంఎస్‌టీఎఫ్
రాష్ట్ర అధ్యక్షుడు కొండయ్య
ఖమ్మంసహకారనగర్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల వ్యవస్థను పూర్తిస్థాయిలో పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని టీఎస్ ఎంఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండయ్య డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహ బూబాబాద్ జిల్లాల స్థాయి టీఎస్ ఎంఎస్‌టీఎఫ్ సమావేశం ఖమ్మంలో ఆదివారం నిర్వహించగా.. ఆయన పాల్గొని, మాట్లాడారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంలో మోడల్ స్కూళ్లు కీలక పాత్ర పోషిస్తున్నా, ఉపాధ్యాయులు, సిబ్బంది సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా టీజీటీలకు నోషనల్ సర్వీస్ ప్రయోజనాలు అందించి, హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిలివేరు మహేశ్, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు షేక్ రంజాన్‌తో పాటు నాగరాజు, రంజిత్, సాత్విక్, మోహన్‌రావు, నాగార్జున, ఫణికుమార్, ఉపేందర్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాల
నిధుల ఖర్చుపై ఆడిట్
పాల్వంచ: ప్రభుత్వ పాఠశాలలో ఖర్చు చేసిన నిధుల వినియోగంపై హైదరాబాద్‌కు చెందిన ఆడిట్ అధికారులు తనిఖీ చేశారు. ఆదివారం స్థానిక కేటీపీఎస్ కాలనీలోని అభ్యుదయ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్‌బీ, సీవీసీఏ ఆడిట్ అధికారులు సత్యనారాయణ, శ్రీమన్నా రాయణ, తనూజ్, కరుణాకర్ ఉపాధ్యాయుల నుంచి రికార్డులు, క్యాష్‌బుక్స్, బిల్లులు, ఓచర్లు పరిశీలించారు. స్వచ్ఛభారత్, బడిబాట ఇతర కార్యాక్రమాల నిర్వహణకు చేసిన ఖర్చులను ఆడిట్ చేశారు. జిల్లాలోని కేజీబీవీలు, కళాశాలల నిర్వహణ ఖర్చులను సైతం తనిఖీ చేశారు. అయితే, ఆడిట్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసినందుకు ఆయా ప్రధానోపాధ్యాయుల నుంచి చేతివాటం ప్రదర్శించినట్లు పలువురు వాపోయారు. భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి.


