ఖమ్మంగాంధీచౌక్: భద్రాద్రి బ్యాంకు అందిస్తున్న సేవలతో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొంటోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 29వ సర్వసభ్య సమావేశం ఆదివారం ఖమ్మం నగరంలోని వాసవీ కల్యాణమండపంలో బ్యాంకు చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగింది. తొలుత బ్యాంకు చైర్మన్ 2025–26 సంవత్సర వార్షిక నివేదికను వినిపించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా బ్యాంకు అంచెలంచెలుగా ఎదుగుతూ 25 శాఖలతో అభివృద్ధిపథంలో సాగుతోందని తెలిపారు. బ్యాంకు చరిత్రలో తొలిసారిగా రూ.1,000 కోట్లకు పైగా వ్యాపారంతో రికార్డు సాధించిందని, రాష్ట్రంలోని మొత్తం సహకార బ్యాంకుల వ్యాపారంలో భద్రాద్రి బ్యాంక్ 5 శాతం వాటాను కై వసం చేసుకుందని వివరించారు. 2026 మార్చి 31 నాటికి బ్యాంకు డిపాజిట్లు రూ.629.06 కోట్లు, రుణాలు రూ.401.10 కోట్లకు చేరాయని, దీంతో బ్యాంకు రూ.151.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందన్నారు. గత ఏడాది 4 కొత్త శాఖలను ప్రారంభించామని, ఇందులో భాగంగా తొలిసారిగా హైదరాబాద్‌లో బ్రాంచ్‌ను నెలకొల్పినట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 9 జిల్లాల్లో 25 శాఖలతో బ్యాంకు విస్తరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు 21,849 మంది వాటాదారులతో 30వ వసంతంలోకి విజయవంతంగా అడుగుపెడుతోందని చెప్పారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా సహకార అధికారి గట్టు గంగాధర్, సన్నె ఉదయ్‌ప్రతాప్, వేములపల్లి వెంకటేశ్వరరావు దేవత రాజారావు, మద్ది పిచ్చయ్య, రాజ్ పురోహిత్ చెన్ సింగ్, వైవీఎస్ రావు, రంగా నాగశ్రీనివాసరావు, దారా జీవన్‌రాం, కర్లపూడి నర్మద, కపిలవాయి జయప్రద పాల్గొన్నారు.
వార్షికోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


