వివాదాస్పదంగా మారిన ఘటన
మధిర: మధిర ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 16న ఓ ఉద్యోగిని కుమార్తెకు సీమంతం నిర్వహించగా.. వివాదం నెలకొంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ రాజరాజేశ్వరి త్వరలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈక్రమాన ఆస్పత్రిని చూపించేందుకు గర్భిణిగా ఉన్న తన కుమార్తె, అల్లుడిని 16వ తేదీన తీసుకొచ్చారు. సహచర ఉద్యోగులకు వారిని పరిచయం చేయగా... రాజరాజేశ్వరి కుమార్తె గర్భిణి కావడంతో ఆమెకు ఉద్యోగులు గాజులు, పసుపు, కుంకుమతో పాటు స్వీట్లు అందజేసి ఆశీర్వదించారు. అయితే, ఇందుకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ నెల 18న జిల్లా ఆరోగ్య సమన్వయ అధికారి రాజశేఖర్ గౌడ్ మధిర ఏరియా ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు.
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
వేంసూరు: మండలంలోని అమ్మపాలెం శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ఎస్‌ఐ కవిత, పోలీసు సిబ్బంది దాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.2 వేలు నగదు, 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.


