కూసుమంచి: పాలేరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్., పోలీసు కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అభివృద్ది పనులపై శాఖల వారీగా సమీక్షించిన మంత్రి.. టెండర్లు ఆగిపోయిన పనులకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించడమే కాక నాణ్యతపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజా దర్బార్లలో అందిన దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే, నియోజకవర్గంలోని భూముల రీసర్వే వేగంగా చేపడుతూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఆర్‌డీఓ శ్రీనివాస్, ఎస్‌ఈలు వెంకటరెడ్డి, యుగంధర్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.


