సత్తుపల్లిరూరల్: పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే ప్రజా పోరాటాలను ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు హెచ్చరించారు. మండలంలోని కాకర్లపల్లిలో శనివారం ఆయన నిరుపయోగంగా ఉన్న పాత ఎన్టీఆర్ కాల్వలను పరిశీలించారు. అనంతరం వెంకట్రాములు మాట్లాడుతూ ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న 34 ఎకరాల్లోని పాత ఎన్టీఆర్ కాల్వను పూడ్పించి, కాకర్లపల్లి పేదలతో పాటు సత్తుపల్లిలోని నిరుపేద కుటుంబాల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈవిషయమై ప్రభుత్వ యంత్రాంగం సానుకూలంగా ఉన్నా మంత్రులు, ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇకనైనా సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, నాయకులు జాజిరి జ్యోతి, యర్రా శ్రీనివాసరావు, మేరుగు సత్యనారాయణ, జాజిరి శ్రీనివాస్, మోరంపూడి పాండు రంగారావు, రావుల రాజబాబు, కొలికపోగు సర్వేశ్వరరావు, కువ్వారపు లక్ష్మణరావు, ఇమామ్ పాల్గొన్నారు.


