● వసూలు చేసిన రూ.85లక్షలు ఖర్చు చేసిన నిందితుడు ● తక్కువ ధరతో బంగారం పేరిట 18మందికి టోకరా
కామేపల్లి: తక్కువ ధరకే బంగారం ఇస్తానన్న మాయమాటలతో ఓ వ్యక్తి పలువురి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. డబ్బు తీసుకున్నాక పాపభీతి ఎదురైందో ఏమో కానీ ఆ నగదులో కొంత మేర పూజలు, అన్నదానాలు, ఆలయాల్లో ఉత్సవాలు, ఛత్రపతి శివాజీ విగ్రహాల ప్రతిష్ఠాపనకు వెచ్చించాడు. అంతేకాక కొంత నగదుతో గోవాలో విలాసంగా గడిపి, పాత అప్పులు తీర్చాడు. దివ్యాంగుడైన నిందితుడు 18మంది రూ.85.70లక్షలు వసూలు చేసి పోలీసులకు చిక్కే సరికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం గమనార్హం. ఈమేరకు ప్రధాన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన మరో వ్యక్తిని ఖమ్మం జిల్లా కామేపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా.. శనివారం సీఐ సాగర్, ఎస్సై శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు.
ఏసీ బస్సుల్లో యాత్రలు
దివ్యాంగుడైన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన నారాయణప్ప గురప్ప గతంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, భూములు, బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడు. నగదు వసూలు చేయ డం.. మకాం మార్చి జల్సాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఏడాది క్రితం గురప్ప తన పేరును బోగా లక్ష్మీనారాయణగా చెప్పుకుంటూ అయ్యప్పస్వామి మాల ధరించి కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు వచ్చాడు. ఇక్కడ పూజలు, అన్నదానాలు, పడిపూజలు చేయడం... పలువురిని తన నగదుతో శబరిమలై, ఏడుపాయల యాత్రలకు ఏసీ బస్సుల్లో తీసుకెళ్తూ నమ్మకం పెంచుకున్నాడు. ఇదే మండలం బాసిత్‌నగర్‌కు చెందిన బానోత్ సాయికుమార్‌ను డ్రైవర్ పెట్టుకుని ఆయనతో ఫిబ్రవరి నుంచి తక్కువ ధరలో బంగారం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ప్రజల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేయడం మొదలుపెట్టారు. తొలుత కొందరికి బంగారం రాలేదని, డబ్బులు తిరిగి ఇచ్చేసరికి మిగతా వారు నమ్మి మరింత ఇవ్వడం మొలుపెట్టారు. అంతేకాక ఓ మైనర్ బాలికను తీసుకెళ్లిన ఘటనపై కల్లూరులో కేసు నమోదు కాగా తిరిగి కల్లూరులో దింపి శనివారం బాసిత్‌నగర్ వెళ్తూ అప్పటికే గాలిస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని విచారించగా 18 మంది నుంచి రూ.85.70 లక్షలు వసూలు చేసినా అంతా ఖర్చయిందని వెల్లడించారు. ఇందులో రూ.10.50లక్షలు కొందరికి అప్పుగా ఇచ్చామని చెప్పడంతో ఆ నగదు రికవరీపై పోలీసులు దృష్టి సారించారు. అనేక ప్రాంతాల్లో రూ.కోట్లలో మోసం చేసిన గురప్ప జైలు శిక్ష కూడా అనుభవించాడని గుర్తించారు. ఈమేరకు ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఏఎస్‌ఐ వెంకటరత్నం, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


