మాది దృఢ సంకల్పం | - | Sakshi
Sakshi News home page

మాది దృఢ సంకల్పం

Jul 17 2026 12:41 AM | Updated on Jul 17 2026 12:41 AM

దోపిడీ కోసమే ఇందిరాసాగర్‌, రాజీవ్‌సాగర్‌ను మార్చారు. మున్నేరు లింక్‌ కెనాల్‌ ద్వారా రిజర్వాయర్లు నింపుతాం ‘సీతారామ’ పనుల పరిశీలన, సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి

సీతారామ పూర్తి చేస్తాం..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ సాగర్‌, సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టులను ఈ విడతలోనే పూర్తి చేసేలా దృఢ సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన సత్తుపల్లి మండలం యాతాలకుంటలో సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌ పనులను గురువారం పరిశీలించారు. అనంతరం అధికారులతో టన్నెల్‌ పురోగతి, భూసేకరణ, నిధులపై చర్చించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ఖమ్మం జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించేందుకు ఇందిరాసాగర్‌, రాజీవ్‌ సాగర్‌ ప్రాజెక్టులను రూపొందించగా.. అప్పట్లోనే 60 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. కేవలం రూ.1,500 కోట్లతో ప్రాజెక్టులను పూర్తి చేసే అవకాశం ఉన్నా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్నీ పక్కనపెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్‌ చేసి.. దోపిడీ కోసం అంచనా వ్యయాన్ని ఏకంగా రూ.24 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక రైతుల ప్రయోజనాల కోసం సీతారామ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రూ.100కోట్లతో రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ నిర్మించి ఎన్నెస్పీ కెనాల్‌, వైరా రిజర్వాయర్లకు అనుసంధానించామని చెప్పారు. పాలేరు రిజర్వాయర్‌కు వెళ్లే ఏన్కూరు టన్నెల్‌ పనులు వేగంగా చేపట్టి మున్నేరు నదిని లింక్‌ చేయడం ద్వారా పాలేరు, వైరా, లంకాసాగర్‌ రిజర్వాయర్లను నింపనున్నట్లు వివరించారు. తద్వారా సత్తుపల్లి, పరిసర ప్రాంతాల రైతులకు త్వరగా సాగు అందుతుందని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.వేయి కోట్ల బిల్లులు విడుదల చేయడంతో పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. కాగా, భూసేకరణ కోసం దాదాపు రూ.135 కోట్లు అవసరమని అధికారులు తెలపగా... తక్షణమే క్లియర్‌ చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. నీళ్ల కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నందున ఆ నీరు వృథా కావొద్దన్నదే తమ లక్ష్యమని భట్టి తెలిపారు.

భూసేకరణకు ప్రాధాన్యత

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకంతోపాటు ఇతర నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ నిధులపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణకు మొత్తం నిధులు విడుదల చేస్తూనే, పెండింగ్‌లో ఉన్న బిల్లులు 50 శాతం విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టిని కోరారు. సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుపై గత ప్రభుత్వ హయాం నుంచే ఎన్‌జీటీ కేసు ఉందని వెల్లడించిన ఆయన ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున తీర్పు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. లేదంటే స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ద్వారా న్యాయపోరాటం చేసి కేంద్రం నుంచి క్లియరెన్స్‌ తెచ్చుకుంటామని చెప్పారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి 67 టీఎంసీల నీటి కేటాయింపులు తమ ప్రభుత్వమే సాధించిందని తెలిపారు. చట్టపరమైన సమస్యలను పరిష్కరించి సీతమ్మ సాగర్‌ ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామని ఉత్తమ్‌ వెల్లడించారు.

సీతారామ భూసేకరణకు తక్షణమే రూ.135 కోట్లు

రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం భేషజాలకు పోకుండా సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తోందని వివరించారు. ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా సాగర్‌ ప్రాజెక్టు పరిధిలో సాధ్యమైనంత మేర ఆయకట్టుకు ఏన్కూరు లింక్‌ కెనాల్‌ ద్వారా నీరు విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుల పూర్తిపై తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు దివాకర, అంకిత్‌, పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌దత్‌, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర గిడ్డంగులు, సుడా చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, కల్లూరు ఏసీపీ వసుంధర, ఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ వి.మోహన్‌రావు, ఇరిగేషన్‌ సీఈలు శ్రీనివాసరెడ్డి, ఎం.వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శ్రీనివాసచారి, డీపీఓ రాంబాబు, సీపీఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement