ఇంకుడు గుంతలతో లాభాలు
కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో
‘క్యాచ్ ది రెయిన్’ ప్రచారం
ఇంటింటా ఇంకుడు గుంతల
నిర్మాణానికి సంకల్పం
భూగర్భ జలాల పెంపునకు
విస్తృత అవగాహన
ఖమ్మంమయూరిసెంటర్: ఎన్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కోవడం, భవిష్యత్ తరాలకు నీటి కరువు రాకుండా అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యాన ‘క్యాచ్ ది రెయిన్ – సేవ్ ఎవ్రీ డ్రాప్’ మహోద్యమం మొదలైంది. ఈమేరకు ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అధికారులు ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టడం, భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. నిస్సారమవుతున్న భూగర్భ జల వనరులను పునరుజ్జీవింపజేయడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ‘నీటి సంరక్షణ – అందరి బాధ్యత’ అంటూ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. అంతేకాక ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వర్షపు నీటి సేకరణ వ్యవస్థలను తప్పక ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
సమగ్ర అవగాహన..
ప్రతీ పౌరుడికి వర్షపు నీటి సంరక్షణ ప్రాధాన్యతను వివరించేలా కార్పొరేషన్లు, మున్సిపాలిటీ ఉద్యోగులు జల సంరక్షణ ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు. అధికారులను, సిబ్బంది క్రియాశీలకంగా పాల్గొంటూ అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటును తప్పనిసరి చేయ డం, పాత భవనాల్లోనూ ఏర్పాట్లు చేసేలా యజమానులను ప్రోత్సహిస్తున్నారు.
శాసీ్త్రయ పద్ధతిలో నిర్మాణం
వర్షపు నీటి సేకరణ గుంతల నిర్మాణం శాసీ్త్రయ పద్ధతిలో జరిగితే మేలు కలుగుతుంది. భవనాల పైకప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని పైపుల ద్వారా క్రమపద్ధతిలో ఇంకుడు గుంతకు అనుసంధానించాలి. ఈ గుంతలో పొరలుగా ఉండే పదార్థాలు నీటిని సహజ సిద్ధంగా వడపోసి భూమిలోకి పంపుతాయి. ఇందులోని పై పొర నీరు సులభంగా లోపలికి వెళ్లేందుకు వీలు కల్పించనుండగా, గులకరాళ్లు పెద్ద వ్యర్థాలు, ఆకులను ఆపేస్తాయి. అలాగే, కంకర ద్వితీయ శ్రేణి వడపోతగా పనిచేయనుండగా, ఇసుక సూక్ష్మ ధూళి కణాలను నిరోధించి స్వచ్ఛమైన నీటిని భూమికి అందిస్తుంది. ఇక బరువైన కంకర పునాది పొరగా ఉండి నీటిని వేగంగా భూగర్భంలోకి రీచార్జ్ చేస్తుంది.
ప్రతి ఒక్కరూ జల రక్షకులు కావాలి..
‘మనం దాచే ప్రతీ వర్షపు చుక్కా నీరు మాత్రమే కాదు.. భవిష్యత్ తరాల జీవనాధారం‘ అని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ‘ప్రతీ ఇంటి పైకప్పు ఒక నీటి వనరు – ప్రతీ పౌరుడూ జల సంరక్షకుడు’ అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంటింటా ఇంకుడు గుంతను నిర్మిస్తే జల భద్రతకు బాటలు పడతాయని చెబుతున్నారు. జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనుకునే వారు Pledge.Mygov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ ప్రతిజ్ఞ చేయొచ్చని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.
వర్షపు నీరు వృథా కాకుండా భూమి పొరల్లోకి చేరిస్తే బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. ఎండాకాలంలో వచ్చే నీటి కొరతను అధిగమించి, సుస్థిరమైన నీటి లభ్యత సాధించొచ్చు. కుండపోత వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవకుండా, డ్రెయినేజీల ఒత్తిడి తగ్గించి పట్టణ ప్రాంతాల్లో వరద ముప్పుకు అడ్డుకట్ట వేయొచ్చు. బాహ్య నీటి సరఫరా వనరులపై ఆధారపడడం తగ్గడం వల్ల మున్సిపల్, వ్యక్తిగత నీటి బిల్లులు గణనీయంగా తగ్గుతాయి.


