ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర స్థాయిలో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) పనితీరుకు గుర్తింపు లభించింది. నాబార్డ్ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ఉత్తమ పనితీరు’ అవార్డును ప్రభుత్వ పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.దానకిషోర్ చేతుల మీదుగా సీఈఓ ఎన్.వెంకట్‌ఆదిత్య అందుకున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.3,460 కోట్లుగా ఉన్న డీసీసీబీ లావాదేవీలు 2025–26లో రూ.4,338 కోట్లకు పెరిగాయి. అంతేకాక రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ రూ. 2,995 కోట్ల రుణాలు జారీ చేశారు. వ్యవసాయ అవసరాలకే కాక రైతుల పిల్లలకు విద్యా రుణాలు, స్వయం సహాయక బృందాలు, చిరు వ్యాపారులు కూడా బ్యాంకు రుణాలను అందిస్తోంది., గ్రామీణ ప్రాంతంలో రైతులు, వివిధ వర్గాల ప్రజలకు అందిస్తున్న సేవలను నాబార్డ్ గుర్తించి ఖమ్మం డీసీసీబీకి అవార్డు ప్రకటించింది. బ్యాంకు పాలక మండలి, అధికారులు, ఉద్యోగులు, పీఏసీఎస్‌ల సమష్టి కృషి ఫలితంగానే ఈ అవార్డు వచ్చిందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) బి.ఉదయ్‌భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.
‘ఉత్తమ పనితీరు’ అవార్డుకు ఎంపిక


