● వివరాల్లో తేడా ఉన్నా.. నమోదు చేయకున్నా విచారిస్తాం ● పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ దివాకర
ఖమ్మం సహకారనగర్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ అర్హులైన ప్రతీ ఓటరుకు జాబితాలో స్థానం కల్పించడమే లక్ష్యమని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం కాగా, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ‘సర్’ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వే అనంతరం పోలింగ్ కేంద్రాలు క్రమబద్ధీకరించాక ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. దీనిపై అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించాక తుది ఓటరు జాబితా విడుదల అవుతుందని చెప్పారు. జిల్లాలో 1,460 పోలింగ్ స్టేషన్లు, 12,43,781 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటి వరకు 8,48,491 మంది(68.22శాతం) ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలు డిజిటలైజ్ చేశామని తెలిపారు. డిజిటలైజ్ చేసిన వారిలో సుమారు 72 వేల మందికి సంబంధించి అభ్యంతరాలను రెండు నెలల్లో విచారణ ద్వారా పరిష్కరిస్తామన్నారు. మరో 25 వేల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినా అవసరమైన వివరాలు నమోదు చేయకపోవడంతో మ్యాపింగ్ జరగలేదని తెలిపారు. డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యాక వీరికి నోటీసులు అందుతుతాయని వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం అందని ఓటర్లు ఆన్‌లైన్‌లో తీసుకోవాలని, లేకపోతే బీఎల్‌ఓను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఎస్‌డీసీ సదానందం, ఆర్‌డీఓ శ్రీనివాస్, ఎన్నికల విభాగం డీటీ అన్సారీ పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్
ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యాన జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావాల్సిన ఇసుక బుకింగ్ ఆన్‌లైన్‌లోనే జరగాలని కలెక్టర్ దివాకర స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు ఎంత పరిమాణం ఇసుక, ఎక్కడ నుంచి తెప్పించారో నివేదిక సమర్పించాలని తెలిపారు. ఇసుకను టీజీఎండీసీ, స్యాండ్ బజార్, స్థానికంగా సమకూర్చుకుంటూ ఆన్‌లైన్‌లోనే బుక్ చేయాలని చెప్పారు. కాగా, రీచ్‌ల వారీగా వచ్చిన ఆదాయాన్ని నిబంధనల మేరకు గ్రామపంచాయతీకు పంపిణీ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పీఆర్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈలు వెంకట్‌రెడ్డి, యుగంధర్ రావు, టీజీఎండీసీ పీఓ జి.శంకర్, మైన్స్ ఏజీ ఏజీ ఏ.రమేష్, వివిధ శాఖల అధికారులు బుగ్గయ్య, ఉమామహేశ్వరరావు, మహేష్‌బాబు, రామకోటి, సూపరింటెండెంట్ శర్మ పాల్గొన్నారు.


