వెళ్తున్నానని సహచరులకు విందు !
కొద్దికాలానికే
పాత హాస్టళ్లపై వార్డెన్ల కన్ను
జిల్లాలో తెరపైకి డిప్యూటేషన్ల పైరవీలు
ప్రభుత్వ ఆదేశాలు.. బదిలీల స్ఫూర్తికి గండి కొడుతున్న పలువురు
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలో బదిలీ అయిన వసతిగృహాల వార్డెన్లు మళ్లీ పాత స్థానాలపైనే కన్నేశారు. కొత్తస్థానాల్లో విధుల్లో చేరినా.. అలవాటు పడిన ప్రాణాలు కావడంతో పాత స్థానాల్లోకి తిరిగి వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల (బీసీ, ఎస్సీ వెల్ఫేర్) హాస్టళ్లలో బదిలీలు ముగిసి, కొత్త వార్డెన్లు విధుల్లో చేరిన తర్వాత అసలు తంతు ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం బదిలీ ఉత్తర్వులు రావడంతో తప్పనిసరై కొత్త స్థానాల్లో చేరినా.. మళ్లీ పాత స్థానాలకు లేదా గతంలో పని చేసిన అనుకూలమైన ప్రాంతాలకు వెళ్లేందుకు వార్డెన్లు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఇందుకోసం జిల్లా మొదలు రాష్ట్రస్థాయి వరకు జోరుగా పైరవీలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
తప్పని స్థితిలో చేరినా..
ఇటీవల జరిగిన బదిలీల్లో జిల్లాలోని పలు హాస్టళ్లలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వార్డెన్లను నిబంధనల ప్రకారం బదిలీ చేశారు. ఆ సమయాన ఉన్నతాధికా రుల ఒత్తిడి, నిబంధనల ఉల్లంఘన కావొద్దని కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టారు. కొద్దిరోజులకే అక్కడ ‘సర్దుబాటు’కాలేకపోతున్నామనే సాకుతో మళ్లీ పాత హాస్టళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. గతంలో వదిలిపెట్టిన స్థానాలకు తిరిగి చేరడం లేదంటే సమీపంలోని వసతి గృహాల్లోకి మారడానికి తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది.
‘డిప్యూటేషన్’ అస్త్రంతో ..
కొత్త స్థానాల నుంచి పాత స్థానాలకు మారడానికి కొందరు వార్డెన్లు ఇప్పుడు డిప్యూటేషన్(తాత్కాలిక బదిలీ) మార్గాన్ని ఎంచుకుంటున్నారు. బదిలీల నిబంధనల ప్రకారం ఇంత త్వరగా స్థానచలనం కలిగే అవకాశం లేక డిప్యూటేషన్ పేరుతో తాత్కాలికంగానైనా పాత చోటుకే వచ్చేలా ప్రయత్నిస్తున్నా రు. ఇందుకోసం కొందరు వార్డెన్లు గట్టి పట్టుదలతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల్లో ప్రస్తుతం ఎలాంటి డిప్యూటేషన్లు లేవని అధికారులు చెబుతుంటే.. కొందరు వార్డెన్లు హనుమకొండ, హైదరాబాద్‌లోని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ తమ ఫైళ్లను కదిలించే ప్రయ త్నం చేస్తున్నట్లు తెలిసింది. ఎస్సీ సంక్షేమ శాఖలో కొందరు వార్డెన్లు తమ వ్యక్తిగత, అంతర్ జిల్లా ఇబ్బందులను సాకుగా చూపిస్తూ, హెడ్డాఫీస్ ద్వారా పాత స్థానాలు, లేదా అనుకూలమైన జిల్లాలకు డిప్యూటేషన్ల మంజూరుకు అనుకూలురైన అధికారుల ద్వారా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
బదిలీల ఉద్దేశానికే గండి..
హాస్టళ్ల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేసిన వారిని బదిలీ చేసింది. కానీ, విధుల్లో చేరిన కొన్నాళ్లకే కొందరు వార్డెన్లు పాత స్థానాల కోసం పైరవీ చేస్తుండడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వార్డెన్లు రాకపోకలు సాగిస్తే విద్యార్థుల పర్యవేక్షణ, మెనూ అమలుపై ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక డిప్యూటేషన్లకు అనుమతి ఇవ్వొద్దని పలువురు కోరుతున్నారు.
బదిలీ జరిగిన నెలలోనే ఖమ్మం ఎస్సీ అభివృద్ధి శాఖలో విధులు నిర్వర్తించే ఓ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటేషన్ ఆర్డర్ తెచ్చుకున్నట్లు తెలిసింది. ఆయన పాత స్థానానికి తిరిగి వెళ్తున్న సందర్భంగా ఖమ్మం కార్యాలయ ఉద్యోగులకు విందు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సదరు ఉద్యోగి ఉత్తర్వుల ఆధారంగా ఇంకొందరు ఉద్యోగులు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అయితే, బదిలీ ఉద్యోగులకు ఆరు నెలల వరకు డిప్యూటేషన్లు, బదిలీలు చేయొద్దనే ఆదేశాలు ఉన్నా జిల్లా అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


