వైరా: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కొంతకాలంగా ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చేయడం, ఏకంగా చైర్ పర్సన్ చాంబర్‌లో కూర్చుని ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షించడమే కాక ఉద్యోగులకు ఆదేశా లు జారీ చేస్తున్నారని వైస్ చైర్మన్ కట్ల సంతోష్ ఆరోపించారు. ఆయన బుధవారం కమిషనర్ ఎం.రామచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. మున్సిపాలి టీ కార్మికులకు చైర్‌పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ భర్త కాపా మురళీకృష్ణ విధులు కేటాయిస్తున్నారని, అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అందులో పేర్కొన్నారు. అంతేకాక చైర్‌పర్సన్ చాంబర్‌లో గంటల కొద్ది కూర్చుని సిబ్బంది విధులకు ఇబ్బంది కలిగిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు.
కాంట్రాక్టులో వివాదం..
ఇటీవల మున్సిపాలిటీలో మరుగుదొడ్లు శుభ్రం చేసే కాంట్రాక్టు స్థానికులకు కాకుండా ఏపీలోని చింతలపూడి ప్రాంతానికి చెందిన వారికి చైర్‌పర్సన్ భర్త మురళీకృష్ణ ఇప్పించినట్లు తెలిసింది. ఈ క్రమాన చైర్‌పర్సన్ భర్త – వైస్ చైర్మన్ సంతోష్ మధ్య వాగ్వాదం జరగగా, వైస్ చైర్మన్‌పై పరుష పదజాలంతో మాట్లాడినట్లు సమాచారం. ఈ ఘటనతో కొన్నాళ్లుగా ఉన్న విభేదాలు తీవ్రరూపం దాల్చినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై చైర్‌పర్సన్ భర్త మురళీకృష్ణ మాత్రం మున్సిపాలిటీలో తన పెత్తనం ఏమీ లేదని, ఎవరితో విభేదాలు లేవని పేర్కొనడం గమనార్హం.
చైర్‌పర్సన్ భర్తపై వైస్ చైర్మన్ ఫిర్యాదు


