ఖమ్మంగాంధీచౌక్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత, మెరుగైన బ్యాంకింగ్ సేవలు, కుటుంబ సభ్యులకు అదనపు ప్రయోజనాలు కల్పించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) అందిస్తున్న స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీ ప్యాకేజీ(ఎస్‌జీఎస్‌పీ)ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్‌లోని బుధవారం ఆయన ఎస్‌జీఎస్‌పీ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఎస్‌బీఐ అధికారులు ప్యాకేజీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న ప్రత్యేక సౌకర్యాలు, బీమా రక్షణ, కుటుంబ సభ్యులకు లభించే ప్రయోజనాలు, రుణ సదుపాయాలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం సాధారణ శాలరీ ఖాతాలను నిర్వహిస్తున్న ఉద్యోగులు ఎస్‌జీఎస్‌పీ ఖాతాలుగా మార్చుకుంటే అదనపు ఆర్థిక భద్రత లభిస్తుందని తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా రూ. కోటి వరకు ఉచిత ప్రమాద బీమా రక్షణతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయని వెల్లడించారు. ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ వనపల్లి శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్ రామ్‌బరన్, ఎల్‌డీఎం ఏ.రవిప్రసాద్, కలెక్టరేట్ బ్రాంచ్ మేనేజర్ డి.సునీత, అధికారులు ల్గొన్నారు.


