‘లిఫ్ట్‌’చేయలేక..! | - | Sakshi
Sakshi News home page

‘లిఫ్ట్‌’చేయలేక..!

Jul 15 2026 12:29 AM | Updated on Jul 15 2026 12:29 AM

మరమ్మతుల్లో ఆలస్యం

మూలపడుతున్న ఎత్తిపోతల పథకాలు

నిధుల కొరత, విద్యుత్‌ సమస్యలే కారణం

ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం

ఖమ్మంఅర్బన్‌: రైతులకు వరంగా నిలవాల్సిన జిల్లాలోని పలు చిన్న ఎత్తిపోతల పథకాలు ఒక్క టొక్కటిగా మూలన పడుతున్నాయి. చెరువులు, వాగులు, కాల్వల నుంచి నీటిని ఎత్తిపోసి వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ఈ ఎత్తిపోతల పథకాలను నిర్మించినా, ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురై పనికిరాని స్థితికి చేరుతున్నాయి. నిధుల కొరత, విద్యుత్‌ సమస్యలు, మోటార్లు దెబ్బతినడం, మరమ్మతులు చేపట్టకపోవడం తదితర కారణాలతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో మొత్తం 135 చిన్న ఎత్తిపోతల పథకాలు ఉండగా, అందులో 34 పథకాలు మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 23,614 ఎకరాలకు సాగునీరు అందుతోంది. మరో ఎనిమిది పథకాలు పాక్షికంగా మాత్రమే పనిచేస్తుండగా, 74 పథకాలు పూర్తిగా నిలిచిపోయాయి.

సాగుపై ప్రభావం

జిల్లాలోని మూలన పడిన 74 పథకాల కింద సుమారు 16,858 ఎకరాల ఆయకట్టు ఉంది. పాక్షికంగా పనిచేస్తున్న ఎనిమిది పథకాల కింద మరో 3,859 ఎకరాల సాగుభూమి ఉంది. ప్రస్తుత పరిస్థితితో వేలాది ఎకరాల్లో సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీరంతా బోర్లతో పాటు వర్షాలపై ఆధారపడాల్సి వస్తోంది.

రైతులపైనే మరమ్మతుల భారం

చిన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రధానంగా విద్యుత్‌ సమస్య ఎదురవుతోంది. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, మోటార్లు, వైర్లు దెబ్బతినడం సాధారణమైపోయింది. ప్రభుత్వం నుంచి సత్వర స్పందన లేక రైతులే నగదు పోగు చేసుకుని మరమ్మతు చేయించుకోవాల్సి వస్తోంది. ఇంకొన్ని చోట్ల విద్యుత్‌ బిల్లుల బకాయిల భారంతోనూ కనెక్షన్లు తొలగిస్తున్నారు.

రూ.1.72 కోట్లు వెచ్చిస్తే..

పాక్షికంగా పనిచేస్తున్న పథకాల పునరుద్ధరణకు రూ.1.72 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో మూడు పథకాలకు రూ.64 లక్షలు మంజూరు కాగా, మరో ఐదు పథకాలకు రూ.1.08 కోట్లు రావాల్సి ఉంది. అలాగే పనిచేయని పథకాల మరమ్మతులకు రూ.938.76 లక్షలు మంజూరైనా పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇక మరో 40 పథకాల పునరుద్ధరణకు రూ.4,595.50 లక్షలు అవసరమని నివేదిక సిద్ధం చేశారు.

అవి అసలే పనికిరావు

జిల్లాలో పూర్తి నిరుపయోగంగా మారిన 19 ఎత్తిపోతల పథకాలు మూతపడిన జాబితాలోకి చేరాయి. వీటి కింద సుమారు 2,583 ఎకరాల ఆయకట్టు ఉంది. మరో ఐదు పథకాలను కూడా ఇదే జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోతే మరిన్ని పథకాలు కూడా ఇదే స్థితికి చేరే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన నిధులు విడుదల చేసి పథకాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని.. లేనట్లయితే వేల ఎకరాల ఆయకట్టులో సాగు నిలిచిపోయే అవకాశముందని చెబుతున్నారు.

ఎత్తిపోతల పథకాల నిర్వహణలో కీలకంగా విద్యుత్‌ పనులే ఉంటున్నాయి. అయితే, ఈ పనులు చేసే కాంట్రాక్టర్లు తక్కువగా ఉండడంతో మరమ్మతులు, పునరుద్ధరణ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మంచుకొండ, కొదుమూరు – వందనం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాల రెండో దశతో పాటు ఎర్రుపాలెం మండలంలో జవహర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఐదు పథకాల కోసం జలవనరుల శాఖ అధికారులు అంచనా సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఏన్కూరు మండలంలోని గార్లొడ్డు, జన్నారం తదితర పథకాలు ఉన్నాయని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement