కారేపల్లి: ప్రత్యేక రైలులో కొత్తగూడెం స్టేషన్ తనిఖీకి వెళ్లి వస్తున్న దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్(డీఆర్‌ఎం) గోపాలకృష్ణన్ మంగళవారం కారేపల్లి స్టేషన్‌లో ఆగారు. గోదావరి పుష్కరాలకు ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లలో భాగంగా ఆయన సికింద్రాబాద్ నుంచి కొత్తగూడెం స్టేషన్ వరకు పరిశీలించారు. ఈక్రమాన తిరుగు ప్రయాణంలో కారేపల్లి జంక్షన్‌లో ఆగి స్టేషన్‌లో వసతులపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, డోర్నకల్ నుంచి కొత్తగూడెం వరకు డబ్లింగ్ పనులపై అధికారులతో చర్చించారు. కాగా, కరోనా సమయాన రద్దయిన రైళ్ల పునరుద్ధరణ, కారేపల్లి – ఇల్లెందు రైల్వేగేటు, కారేపల్లి – పేరుపల్లి రైల్వే గేట్ల స్థానంలో ఓవర్ బ్రిడ్జిల ఆవశ్యకతపై కారేపల్లి గ్రామస్తులు డీఆర్‌ఎంకు వినతిపత్రాలు అందజేశారు.
పెనుబల్లి మండల
వాసికి డాక్టరేట్
పెనుబల్లి: మండలంలోని సూరయ్యబంజర్ గ్రామానికి చెందిన బొల్లు సోమయ్య కుమారుడు శివకేశవరావుకు డాక్టరేట్ లభించింది. ఆయన ‘డిజైన్ – అనాలిస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అల్గోరిథం ఫర్ ఎర్లీ ప్రిడిక్షన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్’అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథం, వ్యాసానికి భోపాల్‌లోని రవీంద్రనాథ్‌ఠాగూర్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివకేశవరావును ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.
మోడల్ సోలార్ విలేజ్ పథకంపై సమీక్ష
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మోడల్ సోలార్ విలేజ్ పథకం అమలుపై రెడ్కో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, రైతు డిస్కం సీఎండీ ముషారఫ్ అలీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలోని బోనకల్ మండలంతో పాటు రఘునాథపాలెం, చెరువుమాధారం, స్నానాల లక్ష్మీపురం, సిరిపురం సహా 27 గ్రామాల్లో సోలార్ మోడల్ విలేజ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో 16,837 గృహాలకు రెండేసి కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ యూనిట్, 4,371 వ్యవసాయ పంపుసెట్లకు 7.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ మేరకు పనులపై సమీక్షించిన అధికారులు వేగవంతానికి సూచనలు చేశారు. తొలుత ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పథకం కాంట్రాక్టర్లతో సమావేశమై పనులపై చర్చించారు.
డీఈఓ మళ్లీ కరీంనగర్‌కే..
ఖమ్మంసహకారనగర్: కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా విధులు నిర్వర్తించిన చైతన్య జైనీని గత ఏడాది నవంబర్ 10వ తేదీన ఖమ్మం డీఈఓ (ఎఫ్‌ఏసీ)గా నియమించారు. నాటి నుంచి జిల్లాలో విధులు నిర్వర్తించిన ఆమె రెండు నెలల క్రితం సెలవులో వెళ్లారు. ఆగస్టు 7వ తేదీన సెలవు పూర్తయ్యాక 8వ తేదీన విధుల్లో చేరాల్సి ఉంది. కానీ, ఖమ్మంలో ఆమె పోస్టింగ్‌ను రద్దు చేసి, కరీంనగర్ డీఈఓగా విధుల్లో చేరాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే విధుల్లో చేరి నివేదిక సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు.
భారీ వృక్షం కూలి
స్తంభాలు ధ్వంసం
సత్తుపల్లిటౌన్: విద్యుత్ తీగల వీదుగా ఓ ఇంటిపై భారీ జామాయిల్ వృక్షం కూలిన ఘటన మంగళవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. సత్తుపల్లి గాంధీనగర్‌కు ఆనుకొని అటవీశాఖ ప్లాంటేషన్‌లో భారీ జామాయిల్ వృక్షాలు ఉన్నాయి. ఇందులో ఓ వృక్షం కాలనీలోని ఇంటిపై పడగా ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే, చెట్టు పడడంతో ఇంటి గోడ కూలిపోవడమే కాక నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగి తీగలు తెగిపోయాయి. దీంతో విద్యుత్ శాఖకు సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లిందని ఏఈ శరత్‌బాబు తెలిపారు. కౌన్సిలర్ కూసంపూడి మహేశ్ ఆధ్వర్యాన చెట్ల కొమ్మలను తీయించగా, విద్యుత్ సిబ్బంది స్తంభాలను సరిచేసి సరఫరా పునరుద్ధరించారు.
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
కామేపల్లి: ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్న విషయం వెలుగుచూసింది. మండలంలోని ఊట్కూర్ రెవెన్యూ పరిధిలోని 213 సర్వే నంబర్‌లోని రెవెన్యూ భూమిని సదరు వ్యక్తి ట్రాక్టర్‌తో దున్నించాడు. ఈ భూమి పక్కనే ‘ఈ ప్రభుత్వ భూమిని ఎవరైనా అతిక్రమించినచో కఠిన చర్యలు తీసుకోబడును’అని బోర్డు ఉన్నా పట్టించుకోకుండా సాగు చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కజ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కామేపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు వివరణ కోరగా, క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


