బోనకల్: రైతుల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణ, సురక్షత వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఫారాక్వాట్ కలుపు మందును నిషేధించడం చరిత్రాత్మకమని ఖమ్మం శ్రీరక్ష మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అధినేత గోంగూర వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఫారాక్వాట్ కలుపుమందు దిగుమతి, తయారీ, నిల్వ, అమ్మకం, రవాణాపై నిషేధం ఉంటుందని తెలిపారు. కాగా, ఫారాక్వాట్ వల్ల కలిగే నష్టాలపై శ్రీరక్ష ఆరోగ్య యాత్ర ద్వారా ఖమ్మంలోని 100 గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని వెల్లడించారు.
గురుకులం అధ్యాపకురాలి సస్పెన్షన్
కారేపల్లి: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో కారేపల్లి మైనార్టీ గురుకుల కళాశాల అధ్యాపకురాలిని సస్పెండ్ చేశారు. ఈ నెల 3న మైనార్టీ గురుకుల కాలేజీలో చదివే ఓ బాలిక బంధువు అని చెబుతూ మహిళ వచ్చి బయటకు తీసుకెళ్లింది. అయితే, ముగ్గురు మహిళలు, ఓ యువకుడు కలిసి సదరు బాలికను కిడ్నాప్ చేసినట్లు ఆ తర్వాత బయటపడింది. ఈ మేరకు నలుగురిపై పోక్సో కేసు కూడా నమోదైంది. అయితే, ఆ సమయాన విధుల్లో ఉన్న అధ్యాపకురాలు దుర్గాభవాని అలసత్వమే ఇందుకు కారణమని నిర్ధారించి ఆమెను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చైన్నె నుంచి చిన్నారిని తీసుకొచ్చిన
మేనమామ
అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు
నేలకొండపల్లి: ఓ వ్యక్తి మద్యం మత్తులో చిన్నారితో రెస్టారెంట్‌లో ఉండగా, నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారించి అమ్మమ్మకు అప్పగించారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురానికి చెందిన ఓ కుటుంబం చైన్నెలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుటుంబ విభేదాల కారణంగా ఆ కుటుంబానికి చెందిన చిన్నారిని మేనమామ ఎవరికీ తెలియకుండా చైన్నె నుంచి తీసుకుని సోమవారం రాత్రి వచ్చాడు. నారాయణపురానికి వెళ్తూ నేలకొండపల్లిలో మద్యం సేవించి ఓ రెస్టారెంట్‌లో భోజనానికి రాగా నిర్వాహకులు అనుమానంతో పోలీసులకు అప్పగించారు. మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి వివరాలు ఆరా తీశాక చిన్నారి అమ్మమ్మను పిలిచి అప్పగించారు. కాగా, చిన్నారి పేరిట ఉన్న ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నట్లు గుర్తించామని ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మధిర: మధిర రైల్వేస్టేషన్ సమీపాన మంగళవారం రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మధిర రాయపట్నం సెంటర్‌లో నివసించే యర్రం వెంకటకృష్ణ(38) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు ఇంకా వివాహం కాలేదు. అయితే, ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోంది. ఈవిషయమై జరుగుతున్న వివాదం నేపథ్యాన ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఎవరైనా హత్య చేసి రైలు కిందకు నెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధిర– తొండల గోపవరం స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొనగా వెంకటకృష్ణ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేయగా, మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాసరావు సహకారంతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


