ఇసుక ట్రాక్టర్ పైనుంచి పడిన కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
ఖమ్మంక్రైం: వాహన తనిఖీలు చేపడుతుండగా ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీఓను లారీ ఢీకొనగా మృతి చెందిన ఘటన మరవకముందే ఖమ్మం జిల్లా కేంద్రంలోనూ ప్రమాదం జరిగింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తుండగా జారి పడిన రవాణా శాఖ కానిస్టేబుల్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఖమ్మం ప్రకాష్‌నగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఇన్‌చార్జ్ డీటీఓ శ్రీనివాస్ తనిఖీలు చేపడుతుండగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టుబడింది. ఈ మేరకు ట్రాక్టర్‌ను రవాణా శాఖ కార్యాలయానికి తరలిస్తూ శాఖ కానిస్టేబుల్ అశోక్ ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చుని బయలుదేరాడు. మార్గమధ్యలో బొలేరో వాహనం యూటర్న్ తీసుకుంటూ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఘటనలో ఇంజన్‌పై కూర్చున్న కానిస్టేబుల్ అశోక్ కింద పడగా ట్రాక్టర్ టైరు ఆయన చేయి పైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. దీంతో ఆర్‌టీఓ శ్రీనివాసరావు ఆయనకు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి అశోక్ కుటుంబీకులతో కలిసి తరలించారు. ఘటన సమాచారం అందగానే రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే, రవాణా శాఖ జాయింట్ కమిషనర్లు చంద్రశేఖర్‌గౌడ్, రమేశ్, పాండురంగారావు ఆస్పత్రికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం అశోక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన చేతికి శస్త్రచికిత్స పూర్తయిందని ఆర్‌టీఓ శ్రీనివాస్ తెలిపారు.


