వైరా: దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల అవకాశవాద రాజకీయాలకు బలైపోయిన ఖమ్మం జిల్లాలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ నేతలు శక్తివంచన లేకుండా పని చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గౌతమ్‌రావు సూచించారు. వైరాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతో పాటు కమ్యూనిస్టుల అవకాశ వాద రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. కమ్యూనిస్టులు అపవిత్ర కలయికతో పబ్బం గడుపుకుంటూ సిద్ధాంతాలను గాలికి వదిలేశారని పేర్కొన్నారు. మరోపక్క కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం చేస్తుండగా, జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి చూపడం లేదని తెలిపారు. కాగా, బీజేపీ అవలంబిస్తున్న సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్ నినాదాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడాలని సూచించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బద్దం మహిపాల్‌రెడ్డి, నాయకులు దేవకి వాసుదేవరావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, వాకదాని పుల్లారావు, నంబూరి రామలింగేశ్వరరావు, సన్నె ఉదయ్‌ప్రతాప్, గోంగూర వెంకటేశ్వర్లు, గల్లా సత్యనారాయణ, రుద్ర ప్రదీప్, రమేశ్, సత్యనారాయణ, రవికుమార్, సుబ్బారావు, నరేశ్, సరస్వతి, శ్యామ్‌రాథోడ్, అనిత, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు


