కల్లూరురూరల్: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.1.50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు పోలీసుస్టేషన్‌లో మంగళవారం సత్తుపల్లిరూరల్ సీఐ ముత్తులింగం, ఎస్‌ఐ హరిత వివరాలు వెల్లడించారు. కల్లూరుకు చెందిన స్నేహితులు షేక్ హబీబ్, బొడ్డు చంద్రు గంజాయి తాగడానికి అలవాటు పడారు. గత ఏడాది మణుగూరుకు చెందిన ఇంకో ఇద్దరితో కలిసి ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి వెళ్లి, సన్నీ వద్ద గంజాయి కొనుగోలు చేసి, తీసుకొచ్చి చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపగా బయటకు వచ్చాక హబీబ్ కొంతకాలం బాగానే ఉన్నా మణుగూరు అత్తగారింటికి వెళ్లినప్పుడు పాత స్నేహితుడైన తేజావత్ రమేశ్‌ను కలవగా మళ్లీ గంజాయి తాగడం మొదలైంది. ఆపై చంద్రుతో కలిసి తల్లాడ మండలంలోని ముద్దులూరులో గంజాయి కొనుగోలు చేసి ధర ఎక్కువ కావడంతో హబీబ్, చందు ఈనెల 7న ఒడిశా వెళ్లి వచ్చారు. అలాగే, వాహనం సమకూర్చినందుకు రమేశ్‌కు వాటా ఇస్తామని చెప్పారు. ఒడిశాలో తీసుకొచ్చిన గంజాయితో సోమవారం పేరువంచ వెళ్తుండగా తనిఖీల్లో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ మేరకు రూ.1.50 లక్షల విలువైన మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని హబీబ్, చందు, రమేశ్‌ను మంగళవారం రిమాండ్ చేసినట్లు సీఐ ముత్తులింగం తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్‌ఐ హరిత, సిబ్బంది నర్సింహారావు, లక్ష్మీపతి, శ్రీనివాసరావు, సత్యనారాయణ, రఫీ, విజయ్, రంగారావును సీఐ అభినందించారు.


