పోలీసుల చేతుల్లో లాఠీ, తుపాకీ! | - | Sakshi
Sakshi News home page

పోలీసుల చేతుల్లో లాఠీ, తుపాకీ!

Jul 14 2026 12:18 AM | Updated on Jul 14 2026 12:18 AM

● గతంలో మాదిరి ‘బేసిక్‌ పోలీసింగ్‌’ ● డీజీపీ పర్యటన తర్వాత గస్తీ, బందోబస్తులో మార్పులు

● గతంలో మాదిరి ‘బేసిక్‌ పోలీసింగ్‌’ ● డీజీపీ పర్యటన తర్వాత గస్తీ, బందోబస్తులో మార్పులు

ఖమ్మంక్రైం: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా గస్తీ కాయడం, బందోబస్తు నిర్వహించే పోలీసుల చేతుల్లో లాఠీలు, తుపాకులు ఉంటేనే ఎదుటి వారు మాట వింటారని భావిస్తారు. ‘బేసిక్‌ పోలీసింగ్‌’గా దీన్ని పరిగణిస్తూ కొన్నేళ్ల క్రితం వరకు పోలీసులు ఇలాగే విధులు నిర్వర్తించేవారు. కానీ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం అమల్లోకి వచ్చాక, లాఠీలు, ఆయుధాలను స్టేషన్లకే పరిమితం చేశారు. అయితే, ఇటీవల జిల్లాలో డీజీపీ సీ.వీ.ఆనంద్‌ పర్యటన తర్వాత పోలీసులు ఏళ్ల క్రితం వదిలేసిన విధానంపై దృష్టి సారించారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అందరికీ కాదు...

ఉమ్మడి జిల్లా పర్యటనకు ఇటీవల వచ్చిన డీజీపీ సీ.వీ.ఆనంద్‌ అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ‘సామాన్యులకు చట్టం ద్వారా రక్షణ కవచంలా, అండగా నిలిచేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌ తప్పేమీ కాదు. కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకునే రౌడీలు, గుండాల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందే. అలాంటి వారిని కట్టడి చేయడానికి బేసిక్‌ పోలీసింగ్‌పై దృష్టి సారించాలి’ అని సూచించినట్లు చెబుతున్నారు. ఈమేరకు క్రమశిక్షణ అదుపుతప్పి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యాన గస్తీలో లాఠీలు, ఆయుధాలు తప్పవన్న నిర్ణయానికి వచ్చిన ఖమ్మం కమిషనరేట్‌లో అమలుచేయడం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు అధికారుల వద్ద ఆయుధాన్ని అందుబాటులో ఉంచుకోవడం శ్రేయస్కరంగా భావించి లాఠీలు, తుపాకులతో గస్తీ, బందోబస్తుకు బయలుదేరుతున్నారు. ఈమేరకు కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల అధికారులు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి నిర్మానుష్య ప్రాంతాలు, హాట్‌ స్పాట్లలో అర్ధరాత్రి వేళ గస్తీ పెంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న వారు, రోడ్ల వెంట మద్యం తాగుతున్న వారిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్‌ ఇస్తుండగా.. ఇది నిరంతరం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement