ఖమ్మం అర్బన్: ఖమ్మం కై కొండాయిగూడెం స్టేజీ సమీపాన ఉన్న శ్రీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే అన్నదానానికి దాసరి ఉమామహేశ్వర్‌రావు – రేణుక దంపతులు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం వారు రూ.27,126 విరాళాన్ని ఆలయ కమిటీ బాధ్యులకు అందజేయగా సన్మానించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగండ్ల కోటేశ్వరరావు, భక్తులు పాల్గొన్నారు.
ఉషూ టోర్నీలో రాణించిన క్రీడాకారులు
ఖమ్మం స్పోర్ట్స్: జోగుళాంబ గద్వాల జిల్లాలో ఈనెల 11, 12వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి ఉషూ పోటీల్లో ఖమ్మంకు చెందిన క్రీడాకారులు రాణించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు కె.శశివర్ణిక, పి.సహస్య, ఎన్.చైతన్య, వి.అభిషేక్‌గౌడ్, బి.ప్రేమ్‌కుమార్ ఐదు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు.
దేవాదాయ శాఖ ఈఓలు, మేనేజర్ల సంఘం ఎన్నిక
ఖమ్మంగాంధీచౌక్: ఉమ్మడి ఖమ్మం జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాల ఈఓలు, మేనేజర్ల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఖమ్మం కమాన్‌బజార్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈఓలు, మేనేజర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించాక నూతన కమిటీని ఏకగీవ్రంగా ప్రకటించారు. సంఘం గౌరవ అధ్యక్షుడిగా కొత్తూరు జగన్మోహన్‌రావు, అధ్యక్షుడిగా వనం వెంకటనర్సింహారావు, ఉపాధ్యక్షుడిగా భీమవరపు సూర్యప్రకాషరావు, కార్యదర్శిగా అద్దంకి విజయ్‌కుమార్, సహాయ కార్యదర్శిగా పాకాల వెంకటరమణ, కోశాధికారిగా కాముని శ్రీకాంత్‌తో పాటు కార్యవర్గ సభ్యులుగా మరో ఆరుగురిని ఎన్నుకున్నారు.
విద్యుత్ సంస్థలో
ఖాళీలు భర్తీ చేయాలి
ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అన్‌మ్యాన్డ్, తాత్కాలిక కార్మికులతో భర్తీ చేయాలని టీఈఈయూ 1104 యూనియన్ డిస్కం సలహాదారు టి.శేషగిరిరావు డిమాండ్ చేశారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో సోమవారం యూనియన్ ప్రాంతీయ అధ్యక్షుడు ఎంవీ.రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది విధినిర్వహణలో భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీతారామయ్య, సురేష్, శ్రీధర్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, రమణారావు, మాధవి, స్రవంతి, రమణ, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
స్కాలర్‌షిప్ పేరిట
రూ.5వేలు స్వాహా
ఏన్కూరు: బాలికలకు స్కాలర్‌షిప్ కావాలంటే త్వరగా ఫోన్ పే చేయండి అని సూచించిన వ్యక్తి రూ.5వేలు పంపించాక ఫోన్ స్విచాఫ్ చేసిన ఘటన ఇది. ఏన్కూరు మండలం బురదరాఘఽవపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సాగి సుజాత తెలిపిన వివరాలు... పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సుంకర శ్రావణి తల్లి లక్ష్మికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి సోమవారం ఫోన్ చేశాడు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని, శ్రావణికి కూడా కావాలంటే రూ.5వేలు పంపించాలని సూచించాడు. దీంతో లక్ష్మి నిజమే అనుకుని రూ.5వేలు ఫోన్‌పే ద్వారా పంపించింది. ఆతర్వాత పాఠశాలకు వచ్చి వివరాలు ఆరా తీయగా ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పడం, ఆ నంబర్ స్విచాఫ్ వస్తుండడంతో సైబర్ నేరగాళ్ల పనేనని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. కాగా, అపరిచిత వ్యక్తుల ఫోన్లకు స్పందించవద్దని హెచ్‌ఎం సుజాత సూచించారు.
రేషన్ షాపుల్లో టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం అర్బన్ మండలంలోని పలు రేషన్‌షాపుల్లో విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్ బృందం సోమవారం తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్‌కు చెందిన విజిలెన్స్ ఓఎస్టీ డీఎస్పీ అంజయ్య నేతృత్వాన నాలుగు బృందాలుగా ఏర్పడి ఖమ్మం అర్బన్, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్ ప్రాంతాల్లోని రేషన్ షాపులను పరిశీలించారు. షాపుల అనుమతి, స్టాక్ బోర్డులు, నిల్వలను పరిశీలించారు. ఖమ్మం అర్బన్ మండలం పాండురంగాపురం, బల్లేపల్లి, బాలపేట ప్రాంతాల్లో డీఎస్పీ అంజయ్య స్వయంగా తనిఖీ చేయగా, సన్నబియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ సైదయ్య, ఖమ్మం అర్బన్ డీటీ మెచ్చు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


