ఖమ్మంలీగల్: ప్రాసిక్యూషన్ అధికారులు ప్రజా కేంద్రీకృత, నిష్పాక్షిక, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఎస్.సాంబశివరెడ్డి సూచించారు. జిల్లాలో సోమవారం పర్యటించిన ఆయన ఉమ్మడి జిల్లా ప్రాసిక్యూటింగ్ అధికారులతో సమావేశమయ్యారు. నూతన క్రిమినల్ చట్టాల అమలు, ఈ–ప్రాసిక్యూషన్ వేదిక వినియోగం, కేసుల పరిష్కారం, పరిపాలన, వృత్తిపరమైన అంశాలపై సూచనలు చేశారు. తొలుత జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజును మర్యాదపూర్వకంగా కలిసిన సాంబశివరెడ్డి ప్రాసిక్యూటింగ్ అధికారులకు గదులు, వసతులు కల్పించాలని కోరారు. అలాగే, అదనపు జిల్లా న్యాయమూర్తి సీనయ్యను కూడా కలిశారు. కాగా, పలువురు న్యాయవాదులు సాంబశివరెడ్డని కలిసి ఏపీపీల నియామకంపై వినతిపత్రం ఇవ్వగా, కోర్టు డ్యూటీ అధికారులు తమ సమస్యలను వివరించారు.
ఇక్కడే చదువుకున్నా...
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి జిల్లా పర్యటనలో విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జిల్లాలోని ఎర్రుపాలెం మండలం భీమవరానికి చెందిన తాను ప్రాథమిక గ్రామ ప్రభుత్వ పాఠశాలలో, డిగ్రీ సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో పూర్తిచేశానని తెలిపారు. అంతేకాక మధ్యలో కొన్నాళ్లు ఖమ్మంలోని మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో చదివానని పేర్కొన్నారు. ప్రస్తుతం శాఖాధిపతిగా జిల్లాకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పీవీడీ.లక్ష్మి, స్వప్న, ప్రాసిక్యూషన్ డీడీ(ఇన్‌చార్జ్) జి.డేనియల్ కుమార్, ఏపీపీలు రాజారావు, ఎల్.కిషన్, శరత్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సాంబశివరెడ్డి


