నేలకొండపల్లి: అక్రమంగా అడవి పందులను తీసుకొచ్చి వధించేందుకు సిద్ధం కాగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు.. మెదక్ నుంచి నేలకొండపల్లి మండలంలోని చెరువుమాధారానికి ఆదివారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన పి.నాగరాజు డీసీఎం వ్యాన్‌లో ఏడు అడవి పందులను తీసుకొచ్చారు. వీటిని ఇక్కడ కోసి విక్రయించేందుకు సిద్ధం కావడంతో స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ పి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకోగా, అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ కేవీ రామారావు, సెక్షన్ ఆఫీసర్ పి.దానియేలు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించారు. చనిపోయిన రెండు పందులను పశు సంవర్థక శాఖ అధికారులతో పోస్టుమార్టం చేయించి ఖననం చేయించగా, మరో ఐదింటిని వెలుగుమట్ల అటవీ ప్రాంతంలో వదిలేశారు. అలాగే, నాగరాజుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
రెండు మృతి, మరో ఐదు స్వాధీనం


