కష్టకాలంలో గోదారమ్మ! | - | Sakshi
Sakshi News home page

కష్టకాలంలో గోదారమ్మ!

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

● వైరా రిజర్వాయర్‌లో 14 అడుగుల నీరు ● రెండు రోజుల్లో ఆయకట్టుకు విడుదల

కల్లూరుకు చేరిన గోదావరి జలాలు

● వైరా రిజర్వాయర్‌లో 14 అడుగుల నీరు ● రెండు రోజుల్లో ఆయకట్టుకు విడుదల

వైరా: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు జిల్లాలో సరైన వర్షాలు లేక పంటల సాగుకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, కృష్ణా జలాల ఆధారంగా నిర్మించిన వైరా రిజర్వాయర్‌లోకి మునుపెన్నడూ లేని విధంగా గోదావరి జలాలు వచ్చి చేరాయి. దీంతో ఆయకట్టులో పంటల సాగుకు డోకా లేనట్టేనని రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు వద్ద పంప్‌ హౌస్‌ నుంచి సీతారామ ప్రాజెక్టు ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు రెండు రోజులుగా వైరా రిజర్వాయర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో ఈ నీరు విడుదల చేయగా రాజీవ్‌ కెనాల్‌ నుంచి ఏన్కూరు మండలం తిమ్మారావుపేట ఎస్కేప్‌ లాక్‌ల ద్వారా 20 కి.మీ. మేర ప్రయాణించి రిజర్వాయర్‌లోకి చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం 14 అడుగులు..

వైరా రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా, గోదావరి జలాలు చేరుతుండడంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. రోజుకు 500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, శనివారం సాయంత్రానికి 1.73 టీఎంసీల నీరు నిల్వ ఉందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. గత ఏడాది జూలై 27 నాటికి రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం దాటి అలుగుల ద్వారా వరద పారింది. దీంతో అదేరోజు కుడి, ఎడమ కాల్వ ద్వారా వరి నారు మళ్లకు నీరు విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్‌లో నీరు లేకపోవడం, ప్రతికూల వాతావరణంతో ఈసారి రిజర్వాయర్‌కు కృష్ణా జలాలు చేరే పరిస్థితి కానరావడం లేదు. దీంతో ప్రభుత్వ సూచనలతో రిజర్వాయర్‌కు గోదావరి జలాలు చేరగా, నారు మళ్ల అవసరాలకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు.

25 వేల ఎకరాలకు సరిపడా..

వైరా రిజర్వాయర్‌ నిర్మించి వందేళ్లు పూర్తయింది. తొలినాళ్లలో ఆయకట్టు పరిధిలోని సాగుకు మాత్రమే నీరు విడుదల చేసేవారు. కాలక్రమంలో రిజర్వాయర్‌ నీటిని తాగు అవసరాలకు వినియోగిస్తుండడంతో సాగుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సుమారు 25 వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కూరగాయల వంటి పంటలు ఆయకట్టు పరిధిలో సాగవుతాయి. వందేళ్ల చరిత్రలో గోదావరి నీళ్లు రిజర్వాయర్‌కు చేరడం ఇదే తొలిసారి. ప్రతిరోజు 1.3 టీఎంసీలు తాగునీటి అవసరాలకు వినియోగిస్తుండడంగా, రోజుకు 33 క్యూసెక్కులు ఆవిరి రూపంలో వృథా అవుతుందని అంచనా. రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులకు వస్తే నారుమళ్లకు విడుదల చేసే అవకాశముంటుంది. ప్రస్తుతం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనా గోదావరి జలాలు చేరడం, రెండు రోజుల్లో పూర్తిస్థాయి నీటి మట్టం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఆయకట్టు రైతులను గోదావరి జలాలు ఆదుకున్నట్లవుతుంది.

ఆధునికీకరణ పనులకు బ్రేక్‌

వైరా రిజర్వాయర్‌ ఆధునికీకరణ పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే, రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరడం, ఆయకట్టు పరిధిలో సాగుకు విడుదల చేయాలని అధికారులు సిద్ధమవుతుండడంతో ఆధునికీకరణ పనులు నిలిపివేశారు. అలాగే, కుడి కాల్వ పరిధిలో సిరిపురం నుంచి గరికపాడు వరకు సిల్ట్‌ తొలగించే పనులు చేపడుతుండగా, ఇవి ఒకటి, రెండు రోజుల్లో పూర్తయితే చివరి భూముల వరకు కూడా నీరు అందనుంది.

కల్లూరురూరల్‌: గోదావరి జలాలు సాగర్‌ ప్రధాన కాల్వ నుంచి కల్లూరు సర్కిల్‌ 71వ కి.మీ. వద్దకు శనివారం సాయంత్రం చేరాయి. దీంతో ఈ ప్రాంత రైతులు, నాయకులు గోదావరి జలాలకు పూజలు చేశారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో లింక్‌ కెనాల్‌ నిర్మించి గోదావరి జలాలను సాగర్‌ కాల్వలకు చేర్చారని కల్లూరు మున్సిపల్‌, మార్కెట్‌ చైర్మన్లు డి.మోహన్‌నాయక్‌, బాగం నీరజాదేవి పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో సరైన వర్షపాతం లేకపోగా గోదావరి జలాలు ఇక్కట్లు తీరుస్తాయని తెలిపారు. రైతులు గోదావరి జలాలను పొదుపుగా వాడుకుంటూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరారు. పలు పార్టీల నాయకులు పసుమర్తి చందర్రావు, చిత్తలూరి నరేశ్‌, ఎస్‌కే ఉస్మాన్‌, బాగం ప్రభాకర్‌చౌదరి, జిల్లెల్ల కృష్ణారెడ్డి, భూక్యా శివనాయక్‌, రత్నాల్‌రెడ్డి, జాస్తి శ్రీనివాసరావు, బీరవెల్లి మాధవ్‌, జిల్లెల్ల స్వాతి, దాసరి సంధ్యారాణి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement