జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సత్తా

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

పెనుబల్లి: మండలానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ కొప్పుల గోపాల్‌రావు జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సత్తా చాటారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఫొటోగ్రఫీ (ఎఫ్‌ఐపీ) ఆధ్వర్యాన పాట్నాలో తాజాగా నిర్వహించిన పోటీల్లో ఆయన రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. జాతీయ డిజిటల్‌ సర్క్యూట్‌–2026 ఉమెన్‌ పవర్‌, మెన్స్‌ పవర్‌ విభాగాల్లో గోపాల్‌రావు తీసిన చిత్రాలకు ఈ పతకాలు లభించాయి. ఆయనను ఫొటోగ్రాఫర్లు, స్థానికులు అభినందించారు.

కల్లూరు గురుకులంలో జోనల్‌ ఆఫీసర్‌ తనిఖీ

కల్లూరురూరల్‌: కల్లూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను జోనల్‌ ఆఫీసర్‌ అపర్ణ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థుల చదువు విషయంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. పదో తరగతి విద్యార్థులకు ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వంద శాతం ఫలితాల నమోదుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రిన్సిపాల్‌ కనకదుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

క్రీడాకారులకు

అవగాహనే కీలకం

ఖమ్మంస్పోర్ట్స్‌: క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడపై పూర్తి అవగాహన పెంచుకోవాలని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) కోచ్‌ కె.దీపక్‌ప్రసాద్‌ సూచించారు. ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో శనివారం ‘స్పోర్ట్స్‌ నాలెడ్జ్‌ ఆన్‌ వీల్స్‌’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్రీడా శిక్షణ, అందుకు అవసరమైన పరికరాలు, గాయాలను అధిగమించడం తదితర అంశాలను వివరించారు. క్రీడల ద్వారా వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని తెలిపారు. డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14 వరకు జరిగే కార్యక్రమాన్ని క్రీడాకారులు, శిక్షకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి సునంద, శాయ్‌ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ జి.రాకేశ్‌, డీఎస్‌ఏ మేనేజర్‌ ఉదయ్‌కుమార్‌, కోచ్‌లు ఎండీ గౌస్‌, లాజర్‌, జ్ఞానేశ్‌, నవీన్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సభకు వెళ్తుండగా ప్రమాదం

గాయపడిన మహిళలకు

ఎమ్మెల్యే రాగమయి పరామర్శ

కల్లూరురూరల్‌: చింతకాని మండలం మత్కేపల్లి క్రాస్‌ వద్ద శుక్రవారం సీఎం పాల్గొన్న సభకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. కల్లూరు నుంచి క్రాంతి మహిళా సమాఖ్యకు చెందిన మహిళా సంఘాల సభ్యులు బస్సులో సభకు వెళ్తున్నారు. కొణిజర్ల సమీపాన మరో బస్సు ఢీకొనడంతో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. ఇందులో ఎస్‌కే షాజహాన్‌, ఎస్‌కే షాహిదా, ఫాతిమూన్‌, దేవి, గోరీబి, షకీలా తదితరులు ఉండగా కల్లూరు, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఈ మేరకు కల్లూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ మట్టా రాగమయి పరామర్శించి చికిత్సపై సూపరింటెండెంట్‌ రమేశ్‌తో చర్చించారు. కల్లూరు మున్సిపల్‌ చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌నాయక్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శీలం కోటేశ్వరి, కాంగ్రెస్‌ నాయకులు పసుమర్తి చందర్‌రావు, పోట్రు అర్జున్‌రావు, ఎస్‌కే ఉస్మాన్‌, యాసా శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష

ఖమ్మంలీగల్‌: చెల్లని చెక్కు జారీ చేసిన కేసులో ఏపీలోని బుడ్డాయిపల్లి గ్రామానికి చెందిన కుక్కపల్లి నాగార్జునకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఖమ్మం ప్రిన్సిపల్‌ జూనియర్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కాకుమాని జ్యోతిర్మయి శనివారం తీర్పు చెప్పారు. జిల్లాకు చెందిన తేజావత్‌ కృష్ణారావు వద్ద అప్పు తీసుకున్న నాగార్జున తిరిగి చెల్లించే క్రమాన చెక్కు జారీ చేసినా సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో విచారణ అనంతరం నాగార్జునకు జైలు శిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.7.90 లక్షలు చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు.

తాళం పగలగొట్టి చోరీ

నేలకొండపల్లి: మండలంలోని చెన్నారంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం కొందరు ఆటోలో కొందరు రాగా, బంధువులు కావొ చ్చని స్థానికులు భావించారు. ఆపై ఇంటి తాళం పగులగొట్టి లోపల బీరువా సైతం ధ్వంసం చేసి వెండి పట్టీలు, బంగారం, నగదు చోరీ చేశారు. సాయంత్రం వచ్చిన నర్సమ్మ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement